Hyderabad | హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ బస్తీలోని ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడిన ఉమాశంకర్ అనే వ్యక్తి పవిత్రను కత్తితో పొడిచి చంపాడు.
ఈ దారుణానికి ఒడిగట్టింది మృతురాలి మేన బావనే అని తెలుస్తోంది. తనతో పెళ్లి కోసం ఉమాశంకర్ ప్రపోజల్ పెట్టగా.. పవిత్ర, ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. ఉమాశంకర్‌కు మద్యం అలవాటు ఉండటంతో అతనితో పెళ్లిని యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఉమాశంకర్ సోమవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. పవిత్రను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.