సిటీబ్యూరో, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన విజయ్‌కుమార్ అనే వ్యక్తికి సెప్టెంబర్ నెలలో రూ.160 బిల్లు కడితే.. అక్టోబర్‌లో రూ.3,83,570లు వచ్చినట్లు తెలిపారు. మహేశ్వరం సెక్షన్‌లోని రావిర్యాలకు చెందిన ఈ వినియోగదారుడికి ప్రతీనెలా కేవలం 500 రూపాయల లోపే బిల్లు వస్తుండగా అక్టోబర్‌కు సంబంధించి 3 లక్షల బిల్లు రావడమేంటని అధికారులను అడిగారు. అయితే సెప్టెంబర్‌లో బిల్లును జీరో చేసి సెక్షన్లో చూపించి అక్టోబర్‌లో బిల్లు క్లియర్ అవుతుందని, సాంకేతిక లోపంతో ఇలా వచ్చిందని అధికారులు చెప్పినట్లు తెలిసింది.
నగరశివారులో ఉండే అరుణ్‌కాంత్ అనే వినియోగదారుడు తాను వేరే దగ్గర ఉంటున్నానని, తన ఫ్లాట్‌లో ఎవరూ లేకున్నా తన బిల్లు రూ.2105 వచ్చిందని, ఇలా గత రెండు నెలలుగా జరుగుతుందని డిస్కం అధికారులకు ఫిర్యాదు చేశారు. తన బిల్లులోనే మీటర్ రీడింగ్ జీరో చూపిస్తున్నప్పటికీ మినిమమ్ బిల్లు వేయకుండా ఎక్కడా కరెంట్ వినియోగించుకోకున్నా వేల రూపాయల బిల్లు వస్తున్నదని ఆయన తెలిపారు. అయితే విద్యుత్ అధికారులు మాత్రం ఇప్పటికీ అతని సమస్యను పరిష్కరించకపోగా.. బిల్లు కట్టలేదని కనెక్షన్ కట్ చేస్తామని చెప్పినట్లు తెలిసింది.
ఇవి రెండు కేవలం టీజీఎస్పీడీసీఎల్లో ఫైనాన్స్ సెక్షన్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పాలి. బిల్లులో ఇచ్చిన ఈఆర్వోకు చేసినా, అందులో పేర్కొన్న అధికారులకు కాల్ చేసినా వారి నుంచి ఈ విషయంలో ఎలాంటి స్పందన ఉండకపోగా ఏదైనా సమస్య ఉంటే ప్రధాన కార్యాలయానికి వెళ్లి తేల్చుకోవాలని చెప్పడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ బిల్లులు మోత మోగిస్తున్నాయి. సాధారణంగా వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండి కరెంట్ బిల్లులు ఎక్కువ రావడం సహజమే అయినా ఇప్పుడు వర్షాలు పడుతూ ఎప్పటికప్పుడు వినియోగం తగ్గినప్పటికీ బిల్లులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొందరికి లక్షల్లో బిల్లులు వస్తుంటే మరికొందరు తాము లేకున్నా ఆ ఇంటికి వేల రూపాయల బిల్లులు వస్తున్నాయంటూ వాపోతున్నారు.
విద్యుత్ బిల్లు చూస్తేనే షాక్ కొడుతోంది. మరీ ఇంత భారమా అంటూ వినియోగదారులు వాపోతున్నారు. గత నెలలో రూ. 160లు కడితే ఈనెలలో రూ. 3లక్షలు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతీనెలా మీటర్ రీడింగ్ తీసే ఆపరేటర్ల నిర్లక్ష్యమా, లేక సాంకేతిక లోపమా అంటూ చర్చించుకుంటున్నారు.లక్షల్లో వచ్చిన బిల్లు కట్టకపోతే కరెంట్ కనెక్షన్ తొలగిస్తామని బెదిరిస్తుండడంతో చాలా మంది వినియోగదారులు మెసేజ్‌ల రూపంలో, సోషల్ మీడియాలో దక్షిణ డిస్కంకు తమ సమస్య చెప్పుకొంటున్నారు. స్పందించాల్సిన ఫైనాన్స్ డైరెక్టర్ మాత్రం ఎవరు ఫోన్ చేసినా పెద్దగా స్పందించకపోగా తనకెందుకు వచ్చిన గొడవ అని సాంకేతిక లోపం పేరుతో సమస్యను దాటేస్తున్నట్లు తెలుస్తోంది.
బిల్లులు వేలల్లో, లక్షల్లో రావడానికి సాంకేతిక లోపమే కారణమని విద్యుత్ అధికారులు చెప్పారు. కరెంట్ మీటర్ రీడింగ్ తీసే సమయంలో బిల్లు అధికంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లు వినియోగదారులకు ఇవ్వకూడదని సీఎండీ ఆదేశాలిచ్చారని, గతం కంటే పెద్ద మొత్తంలో బిల్లు వచ్చినట్లు గుర్తిస్తే ఆ బిల్లు ఇవ్వడం ఆపేయాలని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. ఒకవేళ బిల్లు తప్పుగా వస్తే సంబంధిత ఏరియా అధికారిని సంప్రదించడమో లేక ప్రధాన కార్యాలయంలో సవరించుకోవడమో చేయాలని అధికారులు సూచించారు.