సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 27 : 1908 సెప్టెంబర్ 28న సంభవించిన మూసీ మహా వరదలకు 116 ఏండ్లు పూర్తయ్యాయని, ఇది హైదరాబాద్ చరిత్రలో ఘోర విపత్తుగా మిగిలిపోయిందని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ మణికొండ అన్నారు. బుధవారం ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్, సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్, దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్, జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజీల ఆధ్వర్యంలో నాటి మూసీ వరదలలో 150 మంది ప్రాణాలను కాపాడిన ఉస్మానియా ఆవరణలోని చింత చెట్టు కింద స్మారక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ చింత చెట్టు చరిత్రను వివరించారు. ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూసీనది పరిరక్షణకు కృషి చేస్తున్నదని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి చింత చెట్టు ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి సంఘమిత్ర మాలిక్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, వర్ఫసు నీటి సంరక్షణ నిపుణుడు సుభాష్ రెడ్డి, సజ్జన్ సింగ్,రామ్మోహన్ రావు, నయీం ఉల్లా షరీఫ్, ధనుంజయ్, మసూద్, పరాశర్జీ, శోభా సింగ్, అప్సా, ఆమన్ తదితరులు పాల్గొన్నారు.