హైదరాబాద్: నగర శివార్లలోని హైదర్ షాకోట్లో ఉన్న కస్తూర్బాగాంధీ ట్రస్టు (Kasturba gandhi trust) నుంచి 14 మంది మహిళలు అదృశ్యమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాత్రూం కిటికీ అద్దాలు తొలగించి పరారయ్యారు. ఈ మేరకు నార్సింగి పీఎస్లో ట్రస్టు ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో పట్టుబడిన యువతులు, మహిళలను.. కస్తూర్బాగాంధీ స్మారక ట్రస్టులో చేర్చుతారు.
ఈ క్రమంలో పెటా కేసులో అరెస్టయిన శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బాత్రూంలో కిటికీ అద్దాలు, ఊచలు తొలగించి 15 మంది పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఒక యువతికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడే ఉండిపోయింది. మిగిలిన 14 మంది మహిళలు పరారయ్యారు. గుర్తించిన మేనేజరు రామకృష్ణమూర్తి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిపోయిన వారిలో పశ్చిమ బంగాల్, మహారాష్ట్రలకు చెందిన వారు ఉన్నారు.