సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల మొబైల్ ఫోన్లు చోరీకి గురికావడం, మిస్సింగ్ కావడం ఎక్కువగా జరుగుతుందని, సెల్‌ఫోన్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. రాచకొండ పరిధిలో చోరీ, మిస్సింగ్‌కు గురైన 1,130 ఫోన్లను రికవరీ చేసి, ఆయా ఫోన్ల యజమానులకు అప్పగించారు. ఈ సందర్భంగా మంగళవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ.. సెంట్రల్ ఇక్విప్మెంట్ ఐడెంటీటీ రిజిస్ట్రీ(సీఈఐఆర్) ద్వారా పోయిన ఫోన్లను గుర్తించి, వాటిని రికవరీ చేసినట్లు తెలిపారు.
ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి సీసీఎస్ పోలీసులు ఐటీ సెల్ సహకారంతో ఈ ఫోన్లను రికవరీ చేసినట్లు సీపీ తెలిపారు. రెండు నెలల వ్యవధిలో రూ.3.5 కోట్ల విలువైన 1130 మొబైల్ ఫోన్లను ప్రత్యేక బృందాలు రికవరీ చేశాయన్నారు. ఆయా సెల్ఫోన్ల యజమానులకు సీపీ ఫోన్లను అప్పగించి.. రాచకొండ పోలీసుల పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పోయిన ఫోన్లు తమ చేతికి అందడంతో సెల్‌ఫోన్ యజమానులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్‌బాబు, ఏసీపీ కరుణసాగర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.