సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతల సమస్య లేదా ఏదైన ఆపత్కాల పరిస్థితులు ఎదురైనప్పుడు డయల్ 100 నంబర్‌కు కాల్ చేయాలి.. అగ్ని ప్రమాదం జరిగితే 101కు కాల్ చేయాలి.. వైద్య సేవలు, అంబులెన్స్ కోసం 108కు, పిల్లల భద్రత కోసం 1098కు, ఏవైన ప్రకృతి విపత్కర లేదా ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ నంబర్ 1077కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకో రకమైన సమస్యకు ఒక్కో విభాగానికి ఫోన్ చేయాలంటే కొన్ని సార్లు సంబంధిత విభాగాల నంబర్లు తెలియకపోతే ఇబ్బందులు తప్పవు. అంతే కాకుండా సంబంధిత శాఖ కోసం వాకబు చేసి, సమాచారం ఇచ్చే వరకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి నష్టం కలిగే అవకాశం లేకపోలేదు.
ఇవన్నింటినీ నివారించి, సకాలంలో సత్కర పరిష్కారం చూపేందుకు భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డయల్ 112 నంబర్‌ను గత సంవత్సరం డిసెంబర్ 5న తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది. ఈ ఒక్క నంబర్‌కు కాల్ చేస్తే చాలు ఏ రకమైన సేవలనైనా పొందవచ్చని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెల్ డైరెక్టర్ బీవీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. 112 నంబర్‌కు కాల్ చేస్తే ఫైర్, పోలీస్, మెడికల్, డిజాస్టర్ మేనేజ్మెంట్, చైల్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ తదితర అన్ని రకాల అత్యవసర పరిస్థితులకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.
ఈ క్రమంలోనే గడిచిన 5నెలల కాలంలో బాధితులు 112 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా 31ఆత్మహత్యా యత్నాలను సకాలంలో స్పందించి ఆపగలిగామని, అదృశ్యమైన 5మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని, మూడు బాల్య వివాహాలను అరికట్టినట్లు ఆయన వివరించారు. అంతే కాకుండా ఇద్దరు పిల్లల కిడ్నాప్ కేసులను సైతం ఛేదించడం జరిగిందని, ఒకటి అత్యాచార యత్నం, ఒకటి బలవంతపు వివాహం, హత్యాయత్నాన్ని భగ్నం చేసిట్లు జీటీఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు.
డయల్ 112 నంబర్ అనేది దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. అమెరికాలో డయల్ 911 నంబర్ తరహాలోనే మన దేశంలో కూడా ఈ 112ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడ నుంచి అయినా, ఎలాంటి ఆపద వచ్చినా 112కు సమాచారం అందించవచ్చు. దీంతో సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తాయి. ఇక భవిష్యత్తులో డయల్ 100 నంబర్ ఉండదు.
ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా 112కు డయల్ చేస్తే చాలు సంబంధిత అధికారులు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా సార్లు ఎవరికి సమాచారం అందించాలో తెలియదు. అలాంటప్పుడు కేవలం 112కు ఫోన్ చేసి విషయం చెబితే చాలు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అవసరమైన సహాయ, సహకారాలు అందించడం జరుగుతుంది.