
ఎస్సీ రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
మేడ్చల్, జనవరి10(నమస్తే తెలంగాణ): పాల ఉత్పత్తుల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మినీ డెయిరీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మేడ్చల్ జిల్లాలో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్ కింద వంద యూనిట్ల(మినీ డెయిరీల) ఏర్పాటుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధు లు మంజూరు చేయనున్నది. ఒక యూనిట్‌కు రూ.2లక్షలు ఇచ్చేందుకు ఎస్సీ రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. మొదటి దశలో భాగం గా జిల్లాలోని కీసర, ఘట్కేసర్ మండలాలకు ఈ మినీ డెయిరీలను మంజూరు చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే అర్హులను ఎంపిక చేస్తారు. మినీ డెయిరీల ఏర్పాటుకు రూ.లక్ష40వేలు రాయితీ ఇచ్చి.. రూ. 60 వేలను బ్యాంక్‌ల ద్వారా రూణాలు అందిస్తారు. 10 గుంటల భూమి ఉండి భూమికి చెందిన ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకంతో తెలుపు రేషన్‌కార్డులు ఉన్నవారందరూ మినీ డెయిరీల ఏర్పాటుకు అర్హులని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలాజీ తెలిపారు.