మేడ్చల్, ఆగస్టు19(నమస్తే తెలంగాణ): సహకార సంఘాల్లో అడిట్ పూర్తయిన రైతులకు రుణమాఫీ కావడం లేదు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ సహకార సంఘం పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 1330 రైతుల్లో ఏ ఒక్కరికీ రుణమాఫీ జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 9 సహకార సంఘాల్లో ఘట్కేసర్, పూడూర్, అల్వాల్ సహకార సంఘాల్లో అడిట్ జరగలేదన్న నెపంతో రుణమాఫీ నిలిచిపోయిందని రైతులకు అధికారులు తెలిపారు.
అయితే ఇటీవలే అడిట్ పూర్తి అయి మళ్లీ రుణమాఫీ పొందే రైతుల జాబితాను పంపించిన ఇప్పటి వరకు రుణమాఫీ ఊసే లేకుండా పోయింది. పూడూర్ సహకార సంఘం పరిధిలో 14 గ్రామాలు ఉండగా రుణమాఫీ పొందే రైతులు 1423 మంది ఉండగా ఇందులో 214 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చింది. మిగతా రైతులు పూడూర్ సహకారం సంఘం చుట్టూ తిరుగుతున్న ఫలితం లేకుండా పోయింది. బౌరంపేట్ సహకార సంఘంలో 632 మంది రైతులకు 11 మాత్రమే రుణమాఫీ అయ్యింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడు విడుతలుగా రుణమాఫీ అయ్యింది 3,436 మంది రైతులకు మాత్రమే. జిల్లా వ్యాప్తంగా 30 వేల పైచిలుకు రుణమాఫీ పొందే అర్హత ఉన్న 9 సహకార సంఘాల పరిధిలో కొంతమందికి మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
రుణమాఫీ ఎందుకు చేస్తలేరు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంత వరకు చేయలేదు. మొదటి విడుతలో రుణమాఫీ కావాల్సి ఉన్నా ఇంత వరకు రుణమాఫీ చెయ్యలేదు. ఎకరం 20 గుంటల భూమి ఉండగా రూ. 40 వేల రుణం తీసుకున్నాం. మాకు రేషన్ కార్డు ఉన్నా మాఫీ కాలేదు.బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేదు.
– ప్రభాకర్‌రెడ్డి,సోమారం
ఘట్కేసర్ సహకార సంఘ పరిధిలోని ఏ ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదు. నాకు ఐదెకరాల భూమి ఉండగా రూ. 2 లక్షలు పంట రుణం తీసుకున్న. రుణమాఫీ అయితుందని చెబుతున్న ఇప్పటి వరకు కాలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా లేదా చేస్తే త్వరగా చేసి ఆదుకోవాలి.
– నర్సింహ,అంకుశాపురం