గోల్నాక, మే 18 : సాధారణంగా ప్రభుత్వ బడులంటే అందరికీ చులకనే.. ప్రభుత్వ బడుల బలోపేలానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధన్యం ఇవ్వడంతో పాటు మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు దీటుగా మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందజేస్తూ ఉత్తమ ఫలితాలు రాబడుతున్నది. అయినా కొందరు తల్లిదండ్రులు మాత్రం సర్కార్ బడుల వైపు మాత్రం చూడడం లేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులైతే ఏకంగా తమ పిల్లలను కార్పొరేటర్ స్థాయి పాఠశాలల్లో చదివించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే అంబర్‌పేట సీపీఎల్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నిర్వహించిన అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన పది టాపర్స్ అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విద్యార్థులను అభినందిస్తున్న క్రమంలో వింత అనుభవం ఎదురైంది. పలు విద్యార్థులను అభినందిస్తున్న క్రమంలో 9.6 సాధించిన నేహను మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరా తీయగా.. అక్కడే ఉన్న విద్యార్థిని తల్లి ఛాయ దొండొల్కర్ స్పందిస్తూ .. తాను ఇదే పాఠశాలలో హిందీ పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. తన ఇద్దరు కూతుళ్లను ఇదే పాఠశాల చదివించానని చెప్పారు. దీంతో ఆశ్చర్యానికి గురైన ఎమ్మెల్యే .. హ్యాట్సాఫ్ టీచర్ అంటూ నమస్కరించారు. తల్లీ, కూతురును శాలువాతో ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడుల బలోపేతానికి ఇది నిదర్శనమన్నారు. తోటి ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఛాయనుస్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.