సిటీబ్యూరో, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): ఓ పబ్ నిర్వాహకులు గిరాకీ పెంచుకునేందుకు చిల్లర వేషాలకు తెరతీశారు. అమ్మాయిలను ఎర వేసి.. యువకులు అధికంగా మద్యం తాగే విధంగా రెచ్చగొడుతున్నారు. కౌగిలించుకొని..బిల్లులు పెంచేలా చేయాలని యువతులను పురమాయిస్తున్నారు.. ఒక్కో హగ్‌కు వారికి రూ. 1000 చెల్లిస్తున్నట్లు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో తేలింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…పంజాగుట్ట కంట్రీ క్లబ్ అవరణలో ఉండే క్లబ్ టాలీవుడ్ పబ్‌లో అశ్లీల, అసభ్యకరమైన వ్యవహారాలు నడుస్తున్నాయని సమాచారం అందడంతో పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేశ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అర్ధరాత్రి సోదాలు జరిపారు. ఆ సమయంలో అశ్లీల దుస్తులతో ఉన్న 9 మంది యువతులు, 33 మంది మందుబాబులను గుర్తించారు. వారందరినీ అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. దీనికితోడు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహిస్తుండడంతో యజమానులు వేణుగోపాల్, సాయి భరద్వాజ్, రాములను అరెస్టు చేశారు. అయితే ఈ పబ్ పై 2017 నుంచి ఇదే వ్యవహరంపై ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. దీంతో గతంలో ఉన్న లిస్బన్ పబ్ పేరును మార్చి.. క్లబ్ టాలీవుడ్ పబ్‌గా నామకరణం చేశారు. గిరాకీని పెంచుకునేందుకు నిర్వాహకులు బోరబండ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో ఉండే కొందరు అమ్మాయిలను పబ్‌లో ఫ్రీ ఎంట్రీ ఆఫర్ ఇచ్చారు. వారు పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకొని.. మందుబాబులను రెచ్చగొట్టాలంటూ.. నిబంధన పెట్టారు. హగ్‌లు ఇచ్చి.. మరింతగా మద్యం సేవించి బిల్లులను పెంచేలా.. ఆకర్షించాలని సూచించారు. ఇలా చేస్తే.. సులభంగా రోజుకు 5 వేల వరకు సంపాదించవచ్చని ఆశపెట్టారు. దీంతో యువతులు డబ్బుకు ఆశపడి.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు గుర్తించారు.