సిటీబ్యూరో/చార్మినార్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో వీధి నేరాలు పెరిగిపోతున్నాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత ఎక్కువగా నేరాలు పెరిగినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఇందులోనూ పెట్టీకేసులే ఎక్కువని, స్ట్రీట్‌ఫైట్స్, గొడవలు, భయభ్రాంతులకు గురిచేయడం వంటివాటితో వీధినేరాల సంఖ్య పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
20వేలకు పైగా ఫిర్యాదులు..
సిటీలో పెరుగుతున్న వీధినేరాలపై పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి ప్రభావం మొత్తం పోలీసింగ్‌పైనే పడుతుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. చిన్నచిన్న గొడవలు, కొట్లాటలు, దారినపోయేవారిని ఆకతాయిలు వెంబడించడం, అర్థరాత్రి వీధుల్లో చేరి అల్లరిచేయడం, శబ్దాలు చేస్తూ రేసింగ్‌లు నిర్వహించడం వంటివి ఇప్పుడు చాలాచోట్ల సాధారణమయ్యాయి. కొన్నిసార్లు ఆకతాయిలు దాడులకూ తెగపడుతున్నారు.
కళ్లముందు జరుగుతున్న ఈ నేరాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ తరహా ఫిర్యాదులు సుమారు 20వేలకు పైగానే ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేను అడ్డుకోవడం, కూకట్పల్లి వద్ద గంజాయిమత్తులో ఉన్న యువకుడు ఓ కారుపైకి ఎక్కి అందులో ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేయడం వంటివి ప్రస్తుతం నగరంలో దిగజారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది. అటు సోషల్‌మీడియాలో, ఇటు బయట వీటికి సంబంధించి పెద్ద ఎత్తున తమ ఏరియాల్లో జరుగుతున్న గ్యాంగ్వార్లు, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసుల నుంచి పెద్దగా స్పందన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ మాదన్నపేటలో నాలుగురోజుల క్రితం ఓ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఓ వృద్ధురాలిపై పాశవికంగా దాడి చేశారు. కుక్కును తీసుకొచ్చి తమ ఇంటిముందు మలవిసర్జన చేయించడమేంటని ప్రశ్నించిన వృద్ధురాలిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవడంతో సిటీలో ఇది చర్చనీయాంశమయ్యాయి.
హైదరాబాద్ పాతబస్తీ హుస్సేనిఆలం పిఎస్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. ఓ విషయంలో రెండుగ్రూపులుగా విడిపోయి గొడవకుదిగారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘటనలో కొందరికి గాయాలుకూడా అయ్యాయి. దాడి దృశ్యాలు సమీప సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పాటు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా పోలీసులు మాత్రం ఎవరికివారు తమ పరిధి కాదంటూ చేతులెత్తేశారు.
గతనెల నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఒకవ్యకిపై మరొకరు తల్వార్‌తో దాడిచేయగా మొదటి వ్యక్తికి తీవ్రగాయమైంది. అయితే బస్తీకి చెందిన ఓ యువకుడిని గంజాయి కేసుల్లో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడంతో అతనిని ఎందుకు పట్టించావంటూ గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. నడిరోడ్డుపై ఘటన జరగడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు.
ఖైరతాబాద్‌లోని న్యూసీఐబీ క్వార్టర్స్‌కు చెందిన ఒ వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో అది అవమానంగా భావించిన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా అమ్మవారి దేవాలయం వద్ద ఓ బ్యానర్ తొలగింపు విషయంలో కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేయడంతో అవమానంగా భావించారు. ఇదే ఏరియాలో డబుల్బెడ్రూం వద్ద ఓ యువకుడిపై దాడి చేయడంతో పోలీసులను ఆశ్రయించగా, సెటిల్ చేసుకోవాలని సలహా ఇచ్చినట్లు స్థానికులు చెప్పారు. అంతకుముందు ఐమాక్స్ థియేటర్ వద్ద ఇద్దరు దంపతులపై దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించినట్లు విమర్శలున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో గ్యాంగ్‌వార్ కలకలం సృష్టించింది. ఆగస్ట్‌లో జరిగిన ఈ ఘటనలో కొట్టుకున్నవారంతా ఒకే కాలేజికి చెందిన వారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తరచుగా ఈ ప్రాంతంలో కూడా గ్యాంగ్వార్లు జరుగుతున్నాయని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసుల సహకారం ఉందంటూ విమర్శలు..!
ప్రస్తుతం వీధి నేరాలకు పాల్పడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. గతంలో ఎవరిపైన కేసులున్నాయో చూస్తూ వారి అనుచరులుగా చెలామణీ అవుతున్న వారు, నగర వీధుల్లో హల్చల్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నవారిపై నిఘా పెట్టాలని నగర పోలీస్ కమిషనర్ పలుమార్లు పీఎస్‌లకు ఆదేశాలు జారీ చేశారు. చాలాచోట్ల రౌడీషీటర్లను కట్టడి చేయడంతో కొందరిని నగరబహిష్కరణ చేస్తూ వారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఇదంతా ఉన్నతాధికారుల స్థాయిలో జరుగుతుంటే స్థానిక పోలీసులు మాత్రం ఆయా గ్యాంగులతో కుమ్ముక్కై వాటాలు తీసుకొని వారికి కావలసిన సహకారం అందిస్తున్నట్లు సమాచారం. ఇందులో గంజాయి బ్యాచ్‌లతో పాటు రౌడీషీటర్ల దగ్గర ఉండే వారు కూడా ఉన్నారంటూ విమర్శలున్నాయి. కొన్నిచోట్ల ఇంటిముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేసిన సంఘటనలు ఉన్నా.. వాటిపై కూడా పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ విషయంలో పెట్టీకేసులు పెట్టడం వారిని కౌన్సిలింగ్‌కు పిలిపించి అదుపులో పెట్టే ప్రయత్నం చేయాలని పోలీసులు భావిస్తున్నారు.