దుండిగల్,ఏప్రిల్ 5 : ట్విట్టర్లో సామాన్యుడు చేసిన ఫిర్యాదుకు మంత్రి కేటీఆర్ స్పందించారు. సమస్యను పరిష్కరించాలని మంత్రి ఎమ్మెల్యేను ఆదేశించడంతో ఆయన అరగంటలో సమస్యను పరిష్కరించగా స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి 19వ వార్డు బౌరంపేట్ సింహపురికాలనీలో.. వివేకానంద పార్కు అభివృద్ధికి కృషి చేయాలని కాలనీవాసులు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి సమస్యను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌కు ఆదేశించారు. వెంటనే సింహపురికాలనీకి ఎమ్మెల్యే వివేకానంద్, దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరావుతో కలిసి పార్కువద్దకు చేరుకొని సమస్యను పరిశీలించారు.
వందల ఎకరాల వెంచర్ కావడం, సరైన డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో మురుగునీరు కొంతపార్కులో, కొంత ప్రైవేట్ స్థలంలో నిలవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే మురుగునీటిని ట్యాంకర్ల ద్వారా సత్వరమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో అవసరమైన నిధులను ప్రత్యేకంగా మంజూరు చేయించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో పాటుగా వివేకానంద పార్కులో లైట్లు, వాకింగ్ ట్రాక్, ఓపెన్‌జిమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు కాలనీవాసులు మంత్రి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నిజాంపేట్ కార్పొరేటర్ మాధవి, బీఆర్ఎస్ నాయకులు కొలన్ శ్రీనివాస్‌రెడ్డి, మురళీయాదవ్, సుదర్శన్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, దశరథ్, సందీప్‌రావు, ఆంజనేయులు, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
వెల్డన్ బ్రదర్ అంటూ మంత్రి అభినందన..
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడంతో ఎమ్మెల్యే వివేకానంద్‌ను కేటీఆర్ అభినందించారు.‘వెలడన్ బ్రదర్’ అంటూ రీ ట్వీట్ చేయడంతో పాటు వీలైనంత త్వరగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.