హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు సంబురాలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత సభావేదిక ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం.. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
స్ఫూర్తి నింపిన సాంస్కృతిక కార్యక్రమాలు..
వజ్రోత్సవ ముగింపు వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ అలరించాయి. ఆద్యం తం ఆహూతులను కట్టిపడేశాయి. ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం, డల్హౌసీ అరాచకాలు, సిపాయిల తిరుగుబాటు, తెలంగాణలో స్వతంత్ర ఉద్యమ పోరాట ఘట్టాలను కండ్లకు కడుతూ సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికారెడ్డి, ఆమె శిష్యబృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యరూపకం అందరినీ మైమరిపించింది. ప్రఖ్యాత ఖవ్వాలీ కళాకారులు వార్సీ బ్రదర్స్ ఖవ్వాలీ గానం జోష్ నింపింది. లెహరాయి హై తిరంగా, సారాజహాసే అచ్ఛా పాటలతో సభాప్రాంగణంలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని దిగుణీకృతం చేశారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత విభావరి ఆద్యంతం ఊర్రూతలూగించింది. పలు భక్తిగీతాలు, దేశభక్తి పాటలకు కుర్రకారు స్టెప్పులు వేశారు.
యువత కేరింతలతో స్టేడియం యావ త్ మార్మోగిపోయింది. సరిలేరు నీకెవ్వరు పాటను సైనికులకు సమర్పించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు, సైనిక కుటుంబాలతోపాటు, తెలంగాణకు చెందిన జాతీయస్థాయి క్రీడాకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించారు. గోండు వీరుడు కుమ్రంభీం మనుమడు కుమ్రం సోనేరావును, వందెకరాలు దానం చేసి భూదానోద్యమానికి నాంది పలికిన రామచంద్రారెడ్డి కుమారుడు అరవిందరెడ్డిని, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావిరాల వెంకటరామారావు కుమారుడు మాధవరావును, పద్మశ్రీ వనజీవి రామయ్యను, కర్నల్ సంతోష్ తండ్రి ఉపేందర్‌ను సత్కరించారు. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, బాక్సింగ్‌లో కాంస్యం సాధించిన మహ్మద్ హుస్సాముద్దీన్‌ను సన్మానించారు.
అదేవిధంగా వజ్రోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులకు జ్ఞాపికలను అందించారు. ముగిం పు వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి 30 వేల మందికిపైగా ఎల్బీ స్టేడియానికి తరలివచ్చారు. వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ సమన్వయం చేశారు.
ఫాసిస్టు పోకడలను తిప్పికొట్టాలి: కేకే
జాతీయ స్ఫూర్తి అనునిత్యం కొనసాగించాలని వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావు కోరారు. దేశభక్తిని కొందరు తమ పేటెంట్గా చెప్పుకొంటూ, నచ్చని వాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. వారి ఫాసిస్టు పోకడలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణను అద్భుతమైన రీతిలో ప్రగతి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశమంతా కోరుకుంటున్నదన్నారు.
ప్రజలందరికీ ధన్యవాదాలు: సీఎస్
వజ్రోత్సవ వేడుకలు ఆద్యంతం అట్టహాసంగా కొనసాగడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కోటి మందికి పైగా సామూహిక జాతీయ గీతాలపనలో పాల్గొన్నారని వెల్లడించారు. 22.30 లక్షల మందికిపై గాంధీ సినిమాను వీక్షించారని పేర్కొన్నారు. ఫ్రీడమ్ రన్ కార్యక్రమాల్లో 18 లక్షల మంది పాల్గొన్నారని, హరితహారం కార్యక్రమంలో 37.66 లక్షలకు పైగా మొక్కలను నాటామని వివరించారు.