సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నిషేధిత లక్కీ డ్రా స్కీమ్‌తో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ కథనం ప్రకారం.. ఈసీఐఎల్, కమలానగర్లో నివాసముండే షేక్ సలావుద్దీన్, గతంలో లక్కీ డ్రా స్కీమ్‌లు చేసి అరెస్టయిన జల్పల్లికి చెందిన షాహబ్మీర్ ఖాన్, బోరబండకు చెందిన షరీఫ్ ఇతర ఏజెంట్లు కలిసి గ్యాంగ్‌గా తయారయ్యారు. షేక్ సలావుద్దీన్, షాహబ్మీర్ఖాన్లు ఎన్ఐఎస్ఈ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక ప్రకటన బుక్‌లెట్‌ను తయారు చేశారు. ప్రతి నెలా లక్కీ డ్రా తీసే విధంగా స్కీమ్‌ను రూపొందించారు. 16 నెలల కాల వ్యవధితో 3000 మంది సభ్యులు, నెలకు ఒక్కొక్కరూ వెయ్యి రూపాయలు చెల్లించే విధంగా స్కీమ్ పెట్టారు. లక్కీ డ్రాలో ఒక బహుమతి పక్కాగా వస్తుందని ప్రకటించారు. ప్రతి నెలా సభ్యుల వద్ద డబ్బులు వసూలు చేసేందుకు 35 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. ఈ స్కీమ్ కింద రూ. 4.8 కోట్లు నిర్వాహకులకు వస్తుండగా, అందులో సగం కూడా బహుమతులు ఇవ్వడం లేదు. కాగా, మౌలాలిలోని కలర్ ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా జరుగుతున్నట్లు మల్కాజిగిరి ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందానికి సమాచారం అందడంతో అక్కడి చేరుకొని.. షేక్ సలావుద్దీన్, షాహబ్మీర్ఖాన్లను పట్టుకున్నారు. ఏజెంట్ల నుంచి డబ్బు వసూలు చేసే షరీఫ్ పరారయ్యాడు. నిందితుల వద్ద నుంచి రూ. 2.2 లక్షల నగదు, రూ. 10 లక్షల విలువైన 100 ఎల్ఈడీ టీవీలు, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.