నాణేల వేట షురూ..
తాడ్వాయి, ఫిబ్రవరి 21 : జంపన్న వాగులో నాణేల వేట మొదలైంది. భక్తులు పుణ్యస్నానాలు చేసే సమయంలో వాగులో నాణేలు వేయడం ఆనవాయితీ. వాటిని సేకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తాళ్లకు అయస్కాంతం కట్టి వెతకం కనిపించింది.
జనం ఫుల్.. సిగ్నల్ నిల్
ఏటూరునాగారం, ఫిబ్రవరి 21 : జాతరకు భక్తుల రాక పెరుగుతుండడంతో మొబైల్ నెట్‌వర్క్‌లు కుప్పకూలుతున్నాయి. బుధవారం రాత్రి అధికారులు, మీడియా ప్రతినిధులు, భక్తులు సిగ్నల్ అందక ఇబ్బందిపడ్డారు. జంపన్నవాగు, నార్లాపూర్, స్తూపం ఏరియాలో సాయంత్రం తగ్గిపోయాయి. వాట్సాప్ ఫొటోలు, మెస్సేజ్‌లు కూడా చూసేందుకు తంటాలు పడ్డారు. మేడారానికి సుమారు ఐదు కిలోమీటర్ల మేర విడిది చేసిన భక్తులు సిగ్నల్స్ కలువక ఫోన్ పట్టుకుని వెతుక్కోవాల్సి వచ్చింది.
గొర్రెలకు భలే డిమాండ్
రూ. 5 వేల నుంచి రూ. 13 వేల వరకు అమ్మకాలు మేడారం జాతరలో గొర్రెలు, మేకలకు భలే డిమాండ్ ఏర్పడింది. అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు పలువురు భక్తులు ఇంటి నుంచే వీటిని తీసుకొచ్చుకుంటున్నారు. అలా తెచ్చుకోని వారు జాతరలో గొర్రెలు, మేకలు విక్రయిస్తున్న వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అయితే భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న వారు రూ. 5 వేల నుంచి రూ. 13 వేల వరకు అమ్ముతున్నారు. అధిక ధరలున్నా తప్పని పరిస్థితుల్లో అమ్మవార్ల మొక్కుల కోసం కొనుగోలు చేస్తున్నారు.
పెట్రోల్ ధర.. డబుల్
ఏటూరునాగారం, ఫిబ్రవరి 21 : మేడారం జాతరలో పెట్రోల్ ధర భగ్గు మంటోంది. లీటర్ పెట్రోల్‌ను రూ. 250లకు విక్రయిస్తున్నారు. దీంతో భక్తులు బెంబేలెత్తుతున్నారు. పెట్రోల్ బంక్‌లో లీటర్ పెట్రోల్ రూ. 1.09 లకు విక్రయిస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం ఉదయం నుంచి భక్తుల రాక మేడారంలో పెరిగిపోవడవంతో పోలీసులు ద్విచక్ర వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. లోకల్ తిరిగేందుకు పెట్రోల్ అవసరం ఉండడంతో ఒక్కసారిగా వ్యాపారులు ధరను పెంచేశారు. ఏకంగా రూ. 250లకు విక్రయిస్తున్నారు. దీంతో వాహనదారులు ఘొల్లుమంటున్నారు.
లైసెన్స్ ఉంటే రూ.300లేకుంటే రూ.200
ఏటూరునాగారం, ఫిబ్రవరి 21 : జాతరలో కోళ్లు విక్రయించేందుకు లైసెన్స్ తీసుకున్నవారు కోడి రూ.300 విక్రయిస్తుండగా, లైసెన్స్ లేని వారు రూ.200కి అమ్ముతున్నారు. దీంతో లైసెన్స్ పొందిన వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గిరిజనులు కోళ్ల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఐటీడీఏకు రూ.16వేలు డీడీ కట్టిన లైసెన్స్ తీసుకున్నారు. కాగా, జాతరలో ఇప్పటికే అనధికారికంగా సుమారు 200లకు పైగా దుకాణాలు ఏర్పాటయ్యాయి. దీని వల్ల తమకు నష్టం వసుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు, ఐటీడీఏ అధికారులు తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
నెత్తిన ఎండ.. కేసీఆర్ కిట్ బ్యాగ్ అండ..!
వాజేడు, ఫిబ్రవరి 21 : పిల్లా జెల్లా, ముల్లెమూటతో జనమంతా మేడారం బాటపడుతున్నారు. కొందరు భక్తులు కేసీఆర్ కిట్ సూట్‌కేస్‌లో కూడా వస్తువులు పెట్టుకుని వస్తున్నారు. అయితే, తలపై ఎండ పడకుండా ఈ సూట్‌కేస్ చాలా ఉపయోగపడుతోంది. దాన్ని నెత్తిన పెట్టుకుని పలువురు భక్తులు వస్తుండగా ‘నమస్తే’క్లిక్‌మనిపించింది.
సెల్ చార్జింగ్@ 30
వాజేడు, ఫిబ్రవరి 21 : మేడారం జాతరలో సెల్‌ఫోన్ చార్జింగ్కు మస్తు గిరాకీ ఉంది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టుకునేందుకు భక్తులు ఎగబడుతున్నారు. గంటకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు.