సర్కార్ చర్యలతో చిన్ననీటి వనరులకు పూర్వ వైభవం
అధునాతన యంత్రాలతో గుర్రపు డెక్క తొలగింపు
15 రోజుల్లో స్వచ్ఛంగా మారిన లంగర్‌హౌస్ చెరువు
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మేయర్ దత్తత
సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): కళ తప్పిన చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. గుర్రపు డెక్క చేరి కళావిహీనంగా మారిన చిన్ననీటి వనరులను శుద్ధి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ ఆహ్లాదకరంగా మార్చుతున్నారు. ఈ క్రమంలోనే లంగర్‌హౌస్ చెరువును మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దత్తత తీసుకున్నారు. 41 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువు అభివృద్ధి, పరిరక్షణపై దృష్టి సారించారు. తరచూ పర్యవేక్షిస్తూ పనుల విషయంలో అధికారులను అప్రమత్తం చేస్తూ స్వల్ప కాలంలోనే పనులు పూర్తి చేయించారు. దీంతో ఈ చెరువు 40 కాలనీల్లో నివసిస్తున్న సుమారు 3 లక్షల మందికి పర్యాటకంగా ఉపయోగపడనుంది. చెరువు పరిశుభ్రతకు విశేషంగా కృషి చేసిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.