సిటీబ్యూరో, మల్కాజిగిరి, జూన్ 5 : ట్రై కార్పొరేషన్లలో పార్కుల నిర్వహణ బాధ్యతలను మహిళ స్వయం సహాయక సంఘాలకు కేటాయింపు నగరంలో చర్చనీయంశంగా మారింది. ఈ నిర్ణయంతో ట్రై కార్పొరేషన్లలో క్షేత్రస్థాయిలో సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు ఆర్ధిక వనరులు సమకూర్చకుండా నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ప్రాజెక్టుపై ప్రభావం చూపనుంది. అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల జోక్యం పెంచేందుకు కొత్త పంథాను తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటాయింపులలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారనేది తెలియాల్సి ఉంది.
సంఘాలకు కేటాయించడంలో ఏ పార్కులు ఏ ప్రాంతంలోని సంఘాలకు కేటాయిస్తారు, నిబంధనలు, ప్రభుత్వ విధివిధానాలపై స్పష్టతలేదు. ట్రై కార్పొరేషన్ల పరిధిలోని పార్కుల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించనున్నారు. మహిళల ఆర్ధిక బలోపేతం లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్కుల నిర్వహణ బాధ్యతల అప్పగింత కార్యక్రమం చేపట్టారు.
ఎల్బీనగర్జోన్లోని సర్కిల్-12 సరూర్‌నగర్ పరిధిలో హుడా సి-టైప్ పార్కు నిర్వహణను జన్మభూమి స్వయం సహాయక సంఘానికి, హయత్‌నగర్ సర్కిల్ పరిధిలోని యశోద ఎన్క్లేవ్ పార్కు నిర్వాహణను ఆదర్శ స్వయం సహాయ సంఘానికి అప్పగించారు. అదేవిధంగా ఉప్పల్జోన్లో చిలుకానగర్‌లోని బ్యాంక్‌కాలనీ పార్కును వేంకటేశ్వరస్వామి, జీవనజ్యోతి, సైలాన్‌బాబా గ్రూపులకు అప్పగించారు. నాచారం సర్కిల్ శక్తిసాయినగర్లోని గోకుల్నగర్కాలనీ పార్కును మునీర గ్రూపుకు కేటాయించారు. మల్కాజిగిరి జోన్‌లోని కీసరలోని ప్రశాంత్ విహార్కాలనీ పార్కును మల్లన్న స్వయం సహాయక సంఘానికి, సాయికృష్ణ ఎన్క్లేవ్ పార్కును వారాహి స్వయం సహాయ సంఘానికి అప్పగించారు. అల్వాల్ సర్కిల్లోని భూదేవినగర్ పార్కును విజయగణపతి గ్రూపునకు, బోయినపల్లి సర్కిల్లోని నెహ్రూనగర్ పార్కును నాగశ్రీ సంఘానికి అప్పగించారు.
మహిళలకు ఆర్ధికంగా బలోపేతం చేయడానికి పార్కుల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, వారికి ఆర్ధికపరమైన భరోసాపై దృష్టిసారించలేదు. దీనితో సంఘాలకు నిర్వహణ కార్యక్రమాలు ప్రశ్నర్ధకంగా మారనున్నాయి. ఇప్పటివరకు కాంట్రాక్టర్లతో పనులు చేపడుతున్న ప్రభుత్వం చేపడుతుంది. అయితే ఇప్పుడు మహిళ సంఘాలకు కేటాయించడంతో పనుల కోసం ముందస్తుగా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడంపై దృష్టిసారించలేదు. మహిళలకు నిర్వహణ శిక్షణ, సాంకేతిక సామర్ధ్యం లేకుండా పనులు నిర్వహణ సాధ్యమేనా?అనేది క్షేత్రస్థాయిలో సమీక్షించి ముందడుగు వేయాలని నగరవాసులు భావిస్తున్నారు.