మియాపూర్, నవంబర్ 11: మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మహిళా శిషు సంక్షేమ శాఖ విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నది. తద్వారా ఇంటికే పరిమితమవుతున్న మహిళలు ఈ పథకాల సద్వినియోగానికి ముందుకు వస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా.. కుటుంబ ఆర్థిక అవసరాల్లో తమ వంతు చేయూతనందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా కూకట్పల్లి సర్కిల్ పరిధి ఆల్విన్‌కాలనీ డివిజన్ దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉచితంగా ద్విచక్ర వాహన డ్రైవింగ్‌లో శిక్షణను అందిస్తున్నారు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న మహిళలు తగు జాగ్రత్తలతో రహదారులపై సొంత డ్రైవింగ్‌తో ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే “మోవో” స్వచ్ఛంద సంస్థ తోడ్పాటుతో ఈ ప్రాంగణం ద్వారా 200 మంది ద్విచక్ర వాహన డ్రైవింగ్‌ను పూర్తి చేసుకోగా.. అందులో కొందరు స్విగ్గీ, అమేజాన్ సంస్థల్లో కొరియర్ విమెన్లుగా ఉపాధి పొందుతున్నారు. మరికొందరు తమ ఇంటి పనులను హాయిగా చక్క బెట్టుకుంటున్నారు. కొందరు ప్రైవేటు విద్యాసంస్థలలో ఉపాధ్యాయులుగా తమ సొంత ద్విచక్ర వాహనాలపై విధులకు హాజరవుతున్నారు. అంతేకాకుండా మహిళా ప్రాంగణంలో శిక్షణకు అనువైన డ్రైవింగ్ ట్రాక్ సైతం అందుబాటులో ఉన్నది. ఇది దేశంలోనే మొట్టమొదటి డ్రైవింగ్ ట్రాక్‌గా గుర్తింపు పొందింది.
ఎన్జీవో తోడ్పాటుతో 9 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి
దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో గత కొంత కాలంగా మహిళలకు ద్విచక్ర వాహన డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటికే 9 బ్యాచ్‌లు పూర్తి కాగా.. ప్రస్తుతం పదో బ్యాచ్ శిక్షణ కొనసాగుతున్నది. బ్యాచ్‌కు 20మంది చొప్పున మొత్తం 200 మంది మహిళలు తమ శిక్షణను పూర్తి చేసుకున్నారు. సదరు స్వచ్ఛంద సంస్థ వాహనాలను, ఇంధనాన్ని, ఇతర అభ్యసన రక్షణ పరికరాలను ఉచితంగా మహిళలకు ఏర్పాటు చేస్తున్నది. మహిళా ప్రాంగణ అధికారులు శిక్షకులకు కావలసిన తగు వసతులను కల్పిస్తూ వారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. మున్ముందు ఇక్కడే లర్నింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియ కూడా ఉంటుందని తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఇక్కడి మహిళా ప్రాంగణాన్ని సందర్శించిన తెలంగాణ మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్ ఆకుల లలిత డ్రైవింగ్ ట్రాక్‌ను సందర్శించి అభ్యాసకులను అభినందించారు.