నిందితుల అరెస్టు ..410 క్వింటాళ్లు స్వాధీనం
సిటీబ్యూరో, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ):/అడ్డగుట్ట, ఫిబ్రవరి 11 : రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ..అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 410 క్వింటాళ్ల పీడీఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు. తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నీలకంఠి మాణిక్యం(45), జక్కపల్లి శంకర్(32) రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. వీరికి వివిధ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించేందుకు చాలామంది ఏజెంట్లు ఉన్నారు. బియ్యాన్ని సేకరించిన అనంతరం పాశమైలారంలోని గోడౌన్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి గుజరాత్‌కు తరలించి.. అక్కడ శర్మ అనే డీలర్‌కు అధిక ధరలకు విక్రయిస్తుంటారు. అలాగే వడ్డేపల్లి రైస్‌మిల్లు, రామారం విలేజ్‌లోని రైస్ మిల్లుల్లో పీడీఎస్ బియ్యాన్ని రీసైకిల్ చేసి కూడా ఎక్కువ రేట్లకు అమ్ముతుంటారు. నీలకంఠి మాణిక్యం, జక్కపల్లి శంకర్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఏజెంట్లుగా పనిచేస్తున్న బానోత్ హుస్సేన్, దేవేందర్, పవన్ కళ్యాణ్, నీలకంఠి మహేశ్, రామ్‌జీ, ధీరావత్ రాజేశ్, ధీరావత్ లక్ష్మణ్, భానునాయక్, భూక్యరాజు, విజయ్‌కుమార్, భరత్, సంతోష్‌కుమార్, రాములు, ప్రవీణ్ కుమార్‌లను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, తుకారాంగేట్ పోలీసులు సివిల్ సైప్లె అధికారులతో కలిసి పట్టుకున్నారు.
అక్కడి వ్యాపారులు..
జీహెచ్ఎంసీతో పాటు ఇతర జిల్లాల్లో రేషన్ బియ్యాన్ని కొనేందుకు ప్రత్యేక ముఠాలు తిరుగుతున్నాయి. రేషన్ బియ్యం పొందిన కొందరు లబ్ధిదారులు వాటిని దళారులకు రూ. 8 నుంచి రూ. 9కి కిలో చొప్పున విక్రయిస్తున్నారు. దళారులు వీటిని రూ. 14 చొప్పున మెయిన్ ఏజెంట్‌కు విక్రయిస్తుండగా, మెయిన్ ఏజెంట్ రైస్ మిల్లర్లకు రూ. 19 వరకు అమ్ముతున్నాడు. ఇలా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు ఇక్కడి నుంచి రేషన్ బియ్యం వెళ్తున్నది. శుక్రవారం పట్టుబడ్డ సంగారెడ్డికి చెందిన ముఠా నాయకుడు మాణిక్యం రేషన్ బియ్యాన్ని గుజరాత్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి నెల ఇక్కడి నుంచి సుమారు 500 టన్నుల రేషన్ బియ్యాన్ని గుజరాత్‌కు పంపిస్తున్నట్లు పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. అక్కడి వ్యాపారులు ఇక్కడి బియ్యాన్ని రూ. 22 నుంచి రూ. 24కు కొంటున్నారు.