దుండిగల్, ఆగస్టు 21 : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిజాంపేట కార్పొరేషన్, బాచుపల్లిలోని వీఎన్ఆర్విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా, బౌరంపేట ఇందిరమ్మ కాలనీలోకి వెళ్లే రోడ్డులోని ఓ గోదాంలో దుర్గారావు అనే వ్యక్తి గడిచిన రెండేండ్లుగా భాగ్యవతి అండ్ కో పేరుతో కొబ్బరి నూనె తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఎండుకొబ్బరి నుంచి నూనె తీయడంతో పాటు ఇక్కడి నుంచి కొబ్బరిని ఇతరప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇందులో భాగంగా గోదాంలో ఎండుకొబ్బరి (కుడుకలు) పెద్దమొత్తంలో నిల్వ ఉంచారు. దీంతో పాటు కొబ్బరి చిప్పలు, తవుడు సైతం నిల్వచేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం 11:30 గంటల ప్రాంతంలో సదరు గోదాం నుంచి భారీశబ్దాలతో మంటలు చెలరేగి గోదాం అంతటా వ్యాపించాయి. గోదాంలోని ఎండుకొబ్బరి, తవుడు అగ్నికి ఆహుతయ్యాయి.
అదే సమయంలో గోదాంలోనే ఉన్న బొలేరో, డీసీఎం వాహనాలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. మంటలు భారీగాఎగిసి పడటంతో పాటు పరిసర ప్రాంతాల్లో దట్టమైనపొగ కమ్ముకోవడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల, కూకట్పల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం 3గంటల వరకు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతూనే ఉన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం సెలవు దివం కాగా.. కార్మికులు గోదాంలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కాగా ప్రమాదంలో పెద్దమొత్తంలో ఆస్తినష్టం జరిగిందని తెలుస్తుంది. ఈ మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.