మేడ్చల్, జూన్19(నమస్తే తెలంగాణ) : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలాలను గుర్తించారు. జిల్లాలోని 61 గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటికే 56 గ్రామాల్లో స్థలాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా శామీర్‌పేట్ మండలంలో 9, కీసర మండలంలో 8, ఘట్కేసర్ మండలంలో 11, మేడ్చల్ మండలంలో 17, మూడుచింతలపల్లి మండలంలో 11 క్రీడా మైదానాలకు స్థలాల ఎంపిక పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 5 గ్రామాల్లో త్వరలోనే స్థలాలను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఒక్కో క్రీడా మైదానానికి 20 గుంటల నుంచి ఎకరం స్థలాన్ని కేటాయించారు. ఆయా క్రీడా మైదానాల్లో క్రీడాకారులకు అవసరమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్ తదితర వసతులు కల్పించడంతో పాటు ప్రాంగణం చుట్టూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటతున్నారు. అంతేకాకుండా ఉదయం, సాయంత్రం సమయంలో స్థానికులు వాకింగ్, యోగ చేసుకునే వెసులుబాటు సైతం కల్పించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
శివారు మున్సిపాలిటీల్లో ఓపెన్ జిమ్‌లు
ప్రజారోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల పరిధిలోని పార్కుల్లో అన్ని వయస్సుల వారికి ఉపయోగపడే విధంగా ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయగా స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వారు ఈ ఓపెన్ జిమ్‌లను ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 61 ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయగా అవసరమైన చోట మరిన్ని ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలాలను గుర్తిస్తున్నారు.