అమ్మా బైలెల్లినాదో… తల్లీ బైలెల్లినాదో.. అంటూ వినసొంపైన జానపద గీతాలు… డప్పుల దరువులు.. ధూం ధాం నృత్యాల నడుమ అమ్మవారు అంబారీపై ఊరేగారు. గజరాణి రూపవతిపై జగన్మాత మహంకాళి అమ్మవారి ప్రతిరూపాన్ని ప్రతిష్టించిన ఊరేగింపుతో వీధులన్నీ జనసంద్రమయ్యాయి. అంగరంగ వైభవంగా ఘటాలు, ఫలహారపు బండ్లను ఊరేగించారు. ఆనవాయితీ ప్రకారం ఘటాల ఊరేగింపును నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేసి ఘటాల ఊరేగింపులో పాల్గొన్నారు. అంతకుముందు అక్కన్న మాదన్న దేవాలయం వద్ద భక్తిశ్రద్ధలతో రంగం కార్యక్రమం నిర్వహించారు.
చార్మినార్, జూలై 17 :పాతబస్తీ సందడిగా మారింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అమ్మా బైలెల్లినాదో.. తల్లి బైలెల్లినాదో.. అంటూ జానపద గీతాలతో వీధులన్నీ మార్మోగాయి. పోతురాజులు, యువత నృత్యాల మధ్య బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం పాతబస్తీలో ఘటాలు, అంబారీ ఊరేగింపులు కనుల పండువగా సాగాయి. ఆ ఘట్టాలను తిలకించిన భక్తులు తన్మయత్వం పొందారు.
అమ్మవారిని చల్లంగా చూడాలని వేడుకున్నారు. చార్మినార్ వద్ద జరిగిన ఘటాల ఊరేగింపులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పటిష్ట ఏర్పాట్ల కోసం కావాల్సినంత నిధులు మంజూరు చేశారన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం సుమారు 250 కోట్ల నిధులను కేటాయించినట్లు చెప్పారు.
పాతనగరంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులు అమ్మవారికి తమ ఇష్టపూర్వకంగా సమర్పించిన తొట్టెలను ఘటాల ఊరేగింపులో తరలించారు. శాలిబండ మీదుగా చార్మినార్, మదీనా, ఢిల్లీ దర్వాజ చేరుకొని.. అక్కడి సమీపంలోని ఈసీ నదిలో తొట్టెలను నిమజ్జనం చేస్తారు. ఘటాలు, తొట్టెల ఊరేగింపును తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాతబస్తీకి తరలివచ్చారు.
చార్మినార్, జూలై 17 : పాతనగరంలోని గౌలిపుర, హరిబౌలి అక్కన్న మాదన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాలతో పాటు లాల్‌దర్వాజ సింహవాహిని దేవాలయం వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో రంగం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వర్ణలత భవిష్యవాణిని వినిపిస్తూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు భక్తులు తనను కొలుస్తున్నారని, వారిని క్షేమంగా కాపాడుకుంటానన్నారు. కాస్త ఆలస్యమైనా సమృద్ధ్దిగా వర్షాలు కురుస్తాయన్నారు.
సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగర బోనాల ఉత్సవాలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం, హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం, ఉప్పుగూడ, మీరాలం మండి, కార్వాన్ దర్బార్ మైసమ్మ, సబ్జీమండి, గౌలిపురా ప్రాంతాల్లోని ఆలయాలతో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన ఆలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలోని అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాలతో బోనాల ఉత్సవాలను పర్యవేక్షించినట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం ఆయన పాతబస్తీలోని అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయం తదితర దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు చర్యలను స్వయంగా పరిశీలించారు. అక్కన్న మాదన్న దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగం, ఫలహారం బండ్ల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాతబస్తీలో ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్లు ప్రశాంత వాతావరణంలో బోనాలు జరుపుకొనేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ జాంబాగ్ డివిజన్ కో ఆర్డినేటర్ ధన్‌రాజ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఫలహారం బండి ఊరేగింపును ప్రారంభించారు. బీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి నందకిశోర్ వ్యాస్, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పాల్గొన్నారు.
– అబిడ్స్
సైదాబాద్ జీవన్ జ్యోతి సంఘంలో కొలువైన జయదుర్గాదేవి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఘటాల ఊరేగింపు కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మంద జగన్నాథం, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్ తదితరులు
పాల్గొన్నారు.
– సైదాబాద్, జూలై 17
మెట్టుగూడలో నిర్వహించిన ఫలహారపు బండ్ల ఊరేగింపులో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీత పాల్గొన్నారు.
-అడ్డగుట్ట, జూలై 17
జాంబాగ్‌లో సెట్విన్ మాజీ డైరెక్టర్ ధన్‌రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొని నృత్యాలు చేశారు. అనంతరం ధన్‌రాజ్ రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు.
– అబిడ్స్