నవనాయక ఫలితాలు
ఈ సంవత్సరానికి రాజు- గురువు, మంత్రి- కుజుడు, సేనాధిపతి- చంద్రుడు, సస్యాధిపతి- గురువు, ధాన్యాధిపతి- బుధుడు, అర్ఘాధిపతి- చంద్రుడు, మేఘాధిపతి- చంద్రుడు, రసాధిపతి- శని, నీరసాధిపతి- గురువు, రాజవాహనము- నౌక (నావ), పశుపాలకుడు- శ్రీకృష్ణుడు, గోష్ఠాగార ప్రాపకుడు- శ్రీకృష్ణుడు; గోష్ఠాద్బహిష్కర్త-శ్రీకృష్ణుడు.
గురువు రాజు కావడం వల్ల ఈ సంవత్సరం 4 తూముల వర్షం, 2 తూముల వాయువు ఉంటుంది. ద్విజులు సత్కర్మ నిరతులై ఉంటారు. రాజులు, ప్రజలు న్యాయంగా ప్రవర్తిసారు. రాజనీతి ఉంటుంది. సస్యానుకూల వర్షాలు ఉంటాయి.
ఈ సంవత్సరం ఉప్పు, గంధక ద్రవ్యాలు, తగరం, రబ్బరు, శనగలు, వేరుశనగ, చక్కెర, బెల్లం, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, కల్లు, వ్యాపార వాటాలు, బ్యాంక్ వాటాలు, పత్తి, చర్మం, కుసుమ ధాన్యం, నూలు, దుస్తులు, ఉలవలు, అపర ధాన్యాలు, సిమెంట్, వెండి, బంగారం, ధాన్యం, బియ్యం ధరలు సరసంగా ఉంటాయి.
రాజవాహనం- నౌక (నావ) కావటం వల్ల ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో కల్లోలం రేగుతుంది. పశువులకు నష్టం వాటిల్లుతుంది. పంటల దిగుబడి తగ్గుతుంది. పాలకులు యుద్ధకాంక్షతో రగిలిపోతుంటారు. నౌకలకు సంబంధించి తీవ్ర ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. సముద్రయానంపై ఆధారపడిన వ్యాపారాలు స్తంభించిపోతాయి. ధాన్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. మంత్రి-కుజుడు (అంగారకుడు) కావడం వల్ల ఈ సంవత్సరం యుద్ధాలు సంభవిస్తాయి. చోరాగ్ని భయా లు వెంటాడుతాయి. వర్షపాతం తక్కువే! పంటలకు తెగుళ్ల బాధలు తప్పకపోవచ్చు. లోహాల ధరలకు రెక్కలొస్తాయి.
సేనాధిపతి-చంద్రుడు కావడం వల్ల ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, పెట్రోలు, కిరోసిన్, వెన్న, నెయ్యి, చక్కెర, దుస్తులు, బియ్యం ధరలు పెరుగుతాయి. పంటలకు అనుకూలమైన వర్షాలు కురుస్తాయి. పశువులు సమృద్ధిగా పాలు ఇస్తాయి.
సస్యాధిపతి-గురువు కావడం వల్ల పసుపు వర్ణం ఉన్న భూములు, హరిత వర్ణం ధాన్యం బాగా ఫలిస్తా యి. యవలు, గోధుమలు, శనగలు, పచ్చ జొన్నలు, పెసలు, ఉలవల దిగుబడి పెరుగుతుంది. పత్తి, వెండి, బంగారం, తగరం, రబ్బరు, దుస్తుల ధరలు తగ్గుతాయి.
ధాన్యాధిపతి- బుధుడు కావడం వల్ల వర్షపాతం. ఆకాశాన్ని కమ్మేసిన మబ్బులు గాలి వీచి వీడిపోతాయి. ప్రజల్లో తెలియని భయాందోళనలు నెలకొంటాయి. అడపాదడపా తుఫాన్లు బీభత్సం సృష్టిస్తాయి.
అర్ఘాధిపతి-చంద్రుడు కావడం వల్ల సువృష్టి ఉంటుంది. పంటలకు మేలు కలుగుతుంది. తేనె, ఉప్పు, మణులు, ముత్యాలు, చేపలు, గోధుమలు, ఆహార ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, తమలపాకులు, వెండి, బంగారం ధరలు హెచ్చుగానే ఉంటాయి.
మేఘాధిపతి-చంద్రుడు కావడం వల్ల పంటల దిగుబడి పెరుగుతుంది. వర్షాలు సంతృప్తికరంగా కురుస్తాయి. పాడి పెరుగుతుంది.
రసాధిపతి-శని కావడం వల్ల నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్ల ధాన్యాల దిగుబడి పెరుగుతుంది. నీలిమందు, ఏనుగులు, ఉన్ని, పట్టు, వెండి, బంగారం, కంచు, ఉన్ని శాలువలు మొదలగు వస్తువుల ధరలు పెరుగుతాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి.
నీరసాధిపతి-గురువు కావడం వల్ల వక్కలు, మణులు, రత్నాలు, బంగారం, వెండి, సుగంధ వస్తువులు, చందనం మొదలగు వస్తువుల ఉత్పత్తి పెరిగి.. ధరలు కాస్త దిగిరావొచ్చు.
శ్రీకృష్ణుడు పశుపాలకుడు కావడం వల్ల పశువులకు వృద్ధి, సుభిక్షం ఉంటుంది. పంటల దిగుబడి పెరుగుతుంది. పశువులకు గడ్డి, నీరు సమృద్ధిగా లభిస్తాయి.
గోష్ఠాగార ప్రాపకుడు శ్రీకృష్ణుడు కావడం వల్ల పశు సంపద పెరుగుతుంది. ఈతి బాధలు తగ్గుతాయి.
పశుపాలక-గోష్ఠాగార ప్రాపక-గోష్ఠాద్బహిష్కర్త శ్రీకృష్ణుడి సంపూర్ణాధిపత్య వల్ల పశువృద్ధి, సుభిక్షం, పంటల దిగుబడి పెరడం తదితర మేలైన ఫలితాలు కలుగుతాయి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలం: రాజులు, సామంతులు, మాండలీకులు, దండ నాయకులు, న్యాయాధికారులు, ప్రజలను నానా విధాలుగా పీడిస్తారు. ఆకలి బాధలు అధికమవుతాయి. రాజులు పరస్పరము కలహించి పరాభవం పొందుతారు. క్షుద్ర ధాన్యాల (అపర ధాన్యములు) దిగుబడి పెరుగుతుంది. శ్రీ పరాభవ సంవత్సరాధిపతి కేతువు ఫలం: ఈ సంవత్సరం వర్షాలు మధ్యమమనే చెప్పాలి. చైత్ర వైశాఖ మాసాల్లో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. మేఘాడంబరము, ఉరుములు, మెరుపులు ఉంటాయి. వడగాడ్పులు అధికం. జ్యేష్ఠ మాసంలో వడగాడ్పులు పెరుగుతాయి. అగ్ని భయాలు ఉంటాయి. ఆషాఢంలో అల్పవృష్టి, ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. శ్రావణంలో అతివృష్టి, భాద్రపదంలో ఖండవృష్టి, దుర్భిక్షం ఉంటాయి. ఆశ్వయుజంలో ధాన్యాలు, ధాతు వస్తువులు, రస వస్తువుల ధరలు పెరగుతాయి. కార్తికాది మాస పంచకమున ధరలు పెరుగుతాయి. సింధు, పంజాబ్, సరిహద్దు ప్రాంతాల్లో పంటలు బాగా ఫలిస్తాయి.
గురు సంచారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం కృష్ణ పాడ్యమి సోమవారం తేది 01-06-2026 వరకు గురువు మిథునంలో ఉంటాడు. ఆనాడు రాత్రి 1.45 గంటలకు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి శనివారం తేది 31-10-2026 వరకు కర్కాటకంలోనే సంచరిస్తాడు. అతిచారం కారణంగా అక్టోబర్ 31 పగలు 11-55 గంటలకు గురువు సింహంలోకి ప్రవేశిస్తున్నాడు. మార్గశిర కృష్ణ పాడ్యమి శుక్రవారం 24-1-2027 వరకు సింహంలో ఉండి.. వక్రరీత్యా పునః కర్కాటకంలోకి ప్రవేశించి సంవత్సరాంతం వరకు అదే రాశిలో ఉంటాడు.
శని సంచారం
ఈ సంవత్సరం అంతా మీనంలోనే శని సంచరిస్తున్నాడు. మీనరాశిలో శని సంచారం వల్ల.. సస్యహాని, మృత్యు భయం, రోగపీడలు ఉంటాయి. విపరీత చేష్టలు పెరుగుతాయి. దుర్మార్గులు ప్రబలుతారు. భూకంపాలు, తుఫాన్లు లాంటి ఉత్పాతాలు తలెత్తుతాయి.
రాహువు – కేతువుల సంచారం
ఏడాది మొదలు శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తిక కృష్ణ ద్వాదశి శనివారం తేది 05-12-2026 వరకు రాహువు కుంభంలో, కేతువు సింహంలో సంచరిస్తారు. తదాది సంవత్సరాంతం వరకు రాహువు మకరంలో, కేతువు కర్కాటకంలో సంచరిస్తారు.
వాస్తు కర్తరీలు
శ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ కృష్ణ తదియ సోమవారం తేది 04-05-2026 నుంచి వైశాఖ కృష్ణ నవమి సోమవారం 11-05-2026 వరకు డొల్ల వాస్తు కర్తరీలు కొనసాగుతాయి. తదాది అధిక జ్యేష్ఠ శుక్ల ద్వాదశి తేది 28-05-2026 వరకు నిజ వాస్తు కర్తరీలు ఉంటాయి. మొత్తంగా 04-05-2026 నుంచి 28-05-2026 వరకు వాస్తు కర్తరీల ప్రభావం ఉంటుంది.
గ్రహణ వివరణ
ఈ సంవత్సరం మనదేశంలో కనిపించే గ్రహణాలు ఏమీ లేవు. ఆషాఢంలో సూర్య గ్రహణం, శ్రావణం, పుష్యం, మాఘ మాసాల్లో చంద్ర గ్రహణం ఏర్పడుతున్నప్పటికీ.. ఇవేవీ మన దేశంలో కనిపించవు. కాబట్టి.. గ్రహణ నియమాలు మనకు వర్తించవు.
రోహిణి కార్తె
శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ శుక్ల దశమి సోమవారం తేది 25-05-2026 పగలు 3-37 గంటలకు ఉత్తరఫల్గుణి మూడో పాదంలో కన్యారాశి ప్రయుక్త నిర్జల రాశి అయిన కన్య లగ్నంలో గజ వాహనంపై రోహిణి కార్తె ప్రవేశిస్తున్నది.
ఫలం: పురు-స్త్రీ యోగం: వర్షయోగం, సూర్య-సూర్య యోగం: సవాత వర్షం, కన్యా లగ్నం: వర్షాభావం, నీర నాడి, వాయు మండలం: సవాతవర్షాలు కురుస్తాయి.
మృగశిర కార్తె
శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ కృష్ణ అష్టమి సోమవారం తేది 08-06-2026 పగలు 1-32 గంటలకు పూర్వాభాద్ర నక్షత్ర మొదటి పాదంలో కుంభరాశి ప్రయుక్త నిర్జల రాశి అయిన కన్యా లగ్నంలో మండూక వాహనంపై మృగశిర కార్తె ప్రవేశిస్తున్నది.
ఫలం: పురుష – పురుష యోగం: వర్షాభావం, చంద్ర-సూర్య యోగం: వర్షయోగం, కన్యా లగ్నం: సామాన్య వృష్టి, నీరనాడి, అగ్ని మండలం: వేడి వాయువుతో కూడిన వర్షాలు.
ఆరుద్ర కార్తె
శ్రీ పరాభవ నామ సంవత్సరం నిజ జ్యేష్ఠ శుక్ల అష్టమి సోమవారం తేది 22-06-2026 పగలు 12-25 గంటలకు హస్తా నక్షత్రం మొదటి పాదం కన్యా రాశి ప్రయుక్త నిర్జల రాశి అయిన కన్యా లగ్నంలో ఖర వాహనంపై ఆరుద్ర కార్తె ప్రవేశం.
ఫలం: స్త్రీ-పురుష యోగం: సువృష్టి, చంద్ర-చంద్ర యోగం: సామాన్య వృష్టి, కన్యా లగ్నం: కించిత్ వృష్టి. శుక్ల అష్టమి: సామాన్య వర్షం, సోమవారం: సుభిక్షం, హస్తా నక్షత్రం: శుభప్రదం, వరీయాన్ యోగం: సువృష్టి, బవ కరణం: సుఖప్రదం,
మేష సంక్రమణం
శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర కృష్ణ ద్వాదశి మంగళవారం 14-04-2026 ఉదయం 9-32 గంటలకు శతభిష నక్షత్ర మూడోపాదం, కుంభ రాశి, వృషభ లగ్న సమయంలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
ఫలితం: కృష్ణ ద్వాదశి- శుభప్రదం, మంగళవారం- ధరలు పెరుగును, శతభిష నక్షత్రం- వర్షయోగం, శుక్ల నామ యోగం- వర్ష సూచనలు, కౌలవ కరణం- వర్ష యోగం, పూర్వాహ్ణం- అక్కడక్కడా వర్షాభావ సూచనలు, వృషభ లగ్నం- వర్షం, పూర్వాషాఢాది చతుర్థ మండలం- సుభిక్ష క్షేమారోగ్యాలు.
సాముదాయిక ఫలితం: ప్రజలలో రాజకీయ ప్రేరణ పెరుగుతుంది. సకాల వర్షాల వల్ల పంటలు బాగా పండుతాయి. కొన్ని ఎత్తయిన ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ అస్థిరత ఉంటుంది.
వర్షము-ఆఢకము-ఫలము: ఈ సంవత్సరము 4 తూముల వర్షం, 2 తూముల వాయువు ఉంటుంది. సముద్రంలో ఏడు భాగాలు, పర్వతాలపై తొమ్మిది భాగాలు, భూమి మీద నాలుగు భాగాల్లో వర్షపాతం నమోదవుతుంది.
ఆఢకదారుని నిర్ణయం-ఫలం – ఈ సంవత్సర అంతా మీన రాశిలో శని సంచరిస్తుండటం వల్ల ఆఢకము బ్రాహ్మణుని ఉన్నది. సంవత్సరాది నుంచి జూలై 1వ తేదీ వరకు యవ్వనుడైన బ్రాహ్మణుని చేతిలో జూలై 2 నుంచి ఆగస్టు 20 వరకు వృద్ధ బ్రాహ్మణుని చేతిలో, తదాది సంవత్సరాంతం వరకు యవ్వనుడైన బ్రాహ్మణుని చేతిలో ఆఢకము ఉన్నది. ఫలితంగా అక్కడక్కడా వర్షాలు ఉన్నప్పటికిన్నీ పంటలకు నష్టం వాటిల్లుతుంది.