Numerology | జీవితంలో ఒక్కో దశలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆర్థిక పరిస్థితి లేదా వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాల్లో వచ్చే కీలక పరిణామాలు చాలామంది జీవితాన్ని కొత్త దశలో నడిపిస్తాయి. ఇలాంటి మార్పులనే చాలామంది ‘టర్నింగ్ పాయింట్‘గా భావిస్తారు. అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం మూలాంకాల ఆధారంగా ఎవరి జీవితంలో ఏ వయసులో కీలక మలుపులు వస్తాయో అంచనా వేయొచ్చట.
ఏ నెలలోనైనా 1, 10, 19, 28వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 1గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి సూర్యుడు అధిపతి. నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వావసం, ఉత్సాహం వీరి ప్రత్యేకతగా చెబుతారు. వీరి జీవితంలో 22 నుంచి 28 ఏళ్ల మధ్య కెరీర్‌కు సంబంధించిన కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సంఖ్యా శాస్త్రం పేర్కొంటుంది.
ఏ నెలలోనైనా 2, 11, 20, 29వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 2గా పరిగణిస్తారు. చంద్రుని ప్రభావం కారణంగా వీరు భావోద్వేగపరులు, సున్నిత మనస్తత్వం కలిగిన వారిగా ఉంటారు. వీరి జీవితంలో 24 నుంచి 30 ఏళ్ల మధ్యలో ముఖ్యమైన మార్పులు సంభవించే అవకాశం ఉందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
ఏ నెలలోనైనా 2, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 3 గా ఉంటుంది. గురు గ్రహ ప్రభావం కారణంగా వీరు జ్ఞానం, వివేకం, మార్గదర్శకత్వానికి ప్రతీకలు పరిగణించబడతారు. 27 నుంచి 32 ఏళ్ల మధ్య వీరి జీవితంలో పెద్ద మలుపు వచ్చే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.
ఏ నెలలోనైనా 4, 13, 22, 31వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 4గా ఉంటుంది. కష్టపడి పనిచేసే స్వభావం, కొత్త ఆలోచనలు వీరి ప్రత్యేకతగా చెబుతారు. 30 నుంచి 36 ఏళ్ల మధ్య వీరి జీవితంలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటారు.
ఏ నెలలోనైనా 5, 14, 23వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 5గా ఉంటుంది. బుధగ్రహ ప్రభావం కారణంగా వీరు చురుకుదనం, తెలివితేటలు కలిగి ఉంటారని చెబుతారు. 21 నుంచి 27 ఏళ్ల మధ్యకాలం వీరి జీవితానికి అత్యంత కీలకంగా మారవచ్చని సంఖ్యా శాస్త్రం సూచిస్తోంది.
ఏ నెలలోనైనా 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6గా పరిగణిస్తారు. శుక్ర గ్రహ ప్రభావంతో వీరు ప్రేమ, కళలు, సౌందర్యం, సౌకర్యాల పట్ల ఆకర్షితులవుతారని చెబుతారు. 25 నుంచి 31 ఏళ్ల మధ్య వీరి కెరీర్ లేదా వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని న్యూమరాలజీ నిపుణులు అంచనావేస్తున్నారు.
ఏ నెలలోనైనా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 7గా పరిగణిస్తారు. కేతు గ్రహ ప్రభావం కారణంగా ఆధ్యాత్మికత, తాత్విక ఆలోచనలు, లోతైన విశ్లేషణలు, ఏకాంతాన్ని ఇష్టపడటం వంటి లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. వీరి జీవితంలో 28 నుంచి 34 ఏళ్ల మధ్య అత్యంత ముఖ్యమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. కెరీర్లో కొత్త అవకాశాలు, విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, వ్యాపార విస్తరణ, వ్యక్తిగత జీవితంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఏ నెలలోనైనా 8, 17, 26వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8గా పరిగణిస్తారు. దీని శనిగ్రహం అధిపతి కావడంతో కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన జీవన విధానం వీరి ప్రత్యేకతగా భావిస్తారు. 35 ఏళ్ల వయసు దాటిన తర్వాతనే వీరి జీవితంలో గణనీయమైన మార్పులు కనిపించవచ్చని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థానం, వ్యాపారాల్లో లాభాలు, ఆస్తుల సమీకరణ, ఆర్థిక భద్రత వంటి అంశాల్లో పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి విజయాలు కొంత ఆలస్యంగా వచ్చినా, స్థిరంగా ఉంటాయని అంటున్నారు.
ఏ నెలలోనైనా 9, 18, 27వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 9గా పరిగణిస్తారు. ఈ మూలాంకంపై కుజ గ్రహ ప్రభావం ఉంటుందని చెబుతారు. ధైర్యం, నాయకత్వ లక్షణాలు, సాహస స్వభావం, పోరాట పటిమ వీరిలో ఎక్కువగా కనిపిస్తాయని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. వీరి జీవితంలో 26 నుంచి 33 ఏళ్ల మధ్య అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతారు. కెరీర్లో ఎదుగుదల, వ్యాపార విస్తరణ, ఆర్థిక పురోగతి, సామాజిక గుర్తింపు వంటి అంశాల్లో ఈ కాలం కీలకంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Numerology | ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహం కోసం ప్రాణాలైనా ఇస్తారంట!