Numerology | డబ్బు సంపాదించడం అందరూ చేస్తారు.. కానీ భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడంలోనే చాలామంది విఫలమవుతుంటారు. కొంతమంది ఎంత సంపాదించినా నెలాఖరు వచ్చేసరికి చిల్లిగవ్వ కూడా మిగలదు. అదే మరికొందరు మాత్రం ఆదాయం ఎంత తక్కువ ఉన్నా ఎంతో కొంత తప్పనిసరిగా సేవ్ చేస్తూనే ఉంటారట. అయితే ఈ తేడాకు ఆ వ్యక్తి పుట్టిన తేదీకి సంబంధం ఉంటుందని న్యూమరాలజీ చెబుతోంది.
కొన్ని తేదీల్లో పుట్టి వారికి డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. దాన్ని జాగ్రత్తగా పొదుపు చేయడం, సరైన చోట ఇన్వెస్ట్ చేయడం కూడా బాగా వచ్చని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. ఆయా తేదీల్లో పుట్టిన వారికి ఎక్కడ ఖర్చు చేయాలి? ఎక్కడ తగ్గించాలి? ఎంత పొదుపు చేయాలనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఉంటుందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 4, 6, 8 కలిగిన వ్యక్తులు ఆర్థిక ప్రణాళికలో ముందుంటారని అంటున్నారు.
ఏ నెలలోనైనా 4, 13, 22, 31వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 4గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి చెందిన వారు డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారని న్యూమరాలజీ నిపుణులు చెబుతారు. అనవసర ఖర్చులు చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఏదైనా కొనుగోలు చేయాలన్నా లేదా పెట్టుబడి పెట్టాలన్నా ముందుగా దాని లాభనష్టాలను పరిశీలిస్తారు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వీరి స్వభావం కాదు. అందుకే వీరికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా 6, 15, 24వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 6గా పరిగణిస్తారు. వీరికి విలాసవంతమైన జీవితం అంటే ఇష్టం ఉన్నప్పటికీ, ఆర్థిక భద్రత విషయంలో ఎలాంటి రాజీపడరని న్యూమరాలజీ చెబుతోంది. ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని ఆదా చేయడం కూడా అంతే ముఖ్యమని భావిస్తారు. అందుకే ఖర్చు, పొదుపు మధ్య వీరు సమతుల్యాన్ని పాటిస్తారు. కుటుంబ అవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్తు కోసం డబ్బులను కూడబెట్టే అలవాటు వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది.
సాధారణంగా ఏ నెలలోనైనా 8, 17, 26వ తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8గా పరిగణిస్తారు. ఈ మూలాంకానికి చెందిన వారు డబ్బు విషయంలో పక్కా ప్లాన్‌తో ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది. ధనవంతుల్లా కనిపించడం కంటే ఆర్థికంగా బలంగా ఉండటమే ముఖ్యమని వీరు భావిస్తారు. అందుకే పెట్టుబడుల విషయంలో ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఒక రూపాయి పెట్టినా దాని భవిష్యత్తు లాభాలను అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో వీరు ముందుంటారని చెబుతారు.
మూలాంకం 4, 6, 8 కలిగిన వ్యక్తుల్లో ప్రధానంగా కనిపించే లక్షణం ఆర్థిక క్రమశిక్షణ. సంపాదన ఎంత ఉన్నా ఖర్చులను నియంత్రించడం, పొదుపు చేయడం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించడం వీరి ప్రత్యేకతగా చెప్పొచ్చు. అయితే ఇవన్నీ న్యూమరాలజీలో పేర్కొన్న సాధారణ విశ్లేషణలు మాత్రమే. వ్యక్తిగత ఆర్థిక స్థితి, సంపాదన, పొదుపు అలవాట్లు, కుటుంబ పరిస్థితులు, జీవనశైలి, వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.