నా వయసు 30 ఏండ్లు. కించిత్ కూడా స్వార్థం లేదు. ఉన్నదాంట్లోనే నలుగురికీ పంచాలనుకుంటా. ఇంట్లో వాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మా నాన్న, అత్తామామలు, నా భర్త, అన్న దమ్ముల విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేకపోతున్నా. అయితే వాళ్లంతా నా ప్రేమను, చొరవను భారంగా భావిస్తున్నారు. నేనేదో తప్పు చేస్తున్నట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా అన్నిట్లో తలదూరుస్తున్నానేమో అనిపిస్తున్నది. అందరి మంచినీ కోరుకునే నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదన్న ఒత్తిడి ఇబ్బంది పెడుతున్నది. దయచేసి ఓ పరిష్కారం చెప్పగలరు.
ఓ సోదరి
జ: అందరికోసం బతకడంలో ఆనందాన్ని పొందడం గొప్ప విషయమే. కానీ బంధాల కారణంగా మీరు ఒత్తిడికి గురి అవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. అందరూ మారాలని కోరుకునే ముందు, మీరూ కొంత మారాలి. మీ శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలరు. అవతలివాళ్లకు అవసరం ఉన్నప్పుడే, వారికి అందుబాటులో ఉండండి. అడగకపోయినా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అవమానపడొద్దు. ఒత్తిడి తగ్గేందుకు రోజూ వ్యాయామం, ధ్యానం చేయండి. ఇలా మూడు వారాలపాటు ప్రయత్నించి చూడండి. సమస్య ఇంకా తగ్గకపోతే కౌన్సెలర్‌ను సంప్రదించండి.
సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV
హైదరాబాద్