రోగ నిరోధక శక్తి, ఆరోగ్యకరమైన జీవక్రియలు, గాయాలు మానడం, శరీర ఆరోగ్యానికి దోహదపడే మినరల్స్‌లో జింక్ ప్రధానమైంది. చాలామందికి తమలో జింక్ లోపం ఉన్నదనే సంగతి తెలియదు. దీన్ని పసిగట్టడానికి కొన్ని లక్షణాలను గమనించాలి.
తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్లు బాధిస్తున్నాయంటే జింక్ లోపం కావచ్చు. తెల్ల రక్తకణాల పనితీరును మెరుగుపరచడం ద్వారా శరీర రోగ నిరోధక శక్తిని జింక్ బలోపేతం చేస్తుంది. ఇది లోపిస్తే జబ్బుపడే అవకాశాలు ఎక్కువ.
శరీరంలో కండరాలు, కణాల పెరుగుదలకు జింక్ అత్యవసరం. ఒకవేళ మీకు గాయాలు నెమ్మదిగా మానుతుంటే జింక్ లోపం వల్లేమో అని అనుమానించాలి. జింక్ స్థాయులు తక్కువగా ఉంటే శరీరంలో కొలాజెన్ అంతగా ఏర్పడదు. దీంతో చర్మం పూడుకుపోవడం ఆలస్యం అవుతుంది. గాయాలు మానడం మందగిస్తుంది.
రుచి, వాసన గ్రాహకాలు సక్రమంగా పనిచేయడానికి జింక్ కీలకం. ఇది లోపిస్తే రుచి, వాసన గ్రాహకాలు స్పందించడం తగ్గుతుంది. తిండి రుచించడం లేదంటే జింక్ తక్కువగా ఉందనడానికి సంకేతం కావచ్చు. మాడుపై జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి జింక్ అండగా నిలుస్తుంది. దీని లోపం వల్ల వెంట్రుకల నిర్మాణం బలహీనపడుతుంది. జుట్టు రాలడం, పల్చబడటానికి దారితీస్తుంది. మామూలు కంటే ఎక్కువగా జుట్టు రాలిపోతుంటే భోజనంలో జింక్ అధికంగా లభించే పదార్థాలను చేర్చుకోవాలి.
జింక్ లోపం వల్ల మొటిమలు, దద్దుర్లు లాంటి చర్మ సమస్యలు తలెత్తుతాయి. చర్మంలో ఇన్ఫ్లమేషన్, తైలం ఉత్పత్తిని జింక్ నియంత్రిస్తుంది. తగినంతగా అందకపోతే చర్మం మంటగా అనిపిస్తుంది. ఇన్ఫెక్షన్లు బాధిస్తాయి. గోళ్లపై తెల్లమచ్చలు జింక్ లోపానికి సంకేతాలు. కణాల ఉత్పత్తిలో జింక్ ప్రధానపాత్ర పోషిస్తుంది. తగినంతగా అందకపోతే గోళ్లు బలహీనపడతాయి. పాలిపోతాయి. పెరుగుదల నెమ్మదిస్తుంది. గోళ్లు తేలిగ్గా విరిగిపోతుంటే జింక్ తీసుకోవడం పెరగాలని అర్థం.
మన రుచి, జీర్ణక్రియ, జీవక్రియల సామర్థ్యాలను జింక్ ప్రభావితం చేస్తుంది. ఇది లోపించినప్పుడు ఆకలి తగ్గుతుంది. కాలక్రమంలో అవాంఛనీయ బరువు తగ్గుదల, అలసట, పోషక లోపాలకు దారితీస్తుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
శరీరంలో తగినన్ని జింక్ నిల్వలు ఉంటేనే మెదడు సరిగ్గా పనిచేస్తుంది. లోపిస్తే బైర్లు కమ్మినట్టు ఉంటుంది. ఏకాగ్రత కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్ పనితీరులో జింక్ పాత్ర కూడా ఉంటుంది. తగ్గితే మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
మెదడులో రసాయనాలైన సెరటోనిన్, డోపమైన్లను సమతూకంలో ఉంచటానికి జింక్ ఆవశ్యకం. తగ్గితే ఆందోళన, అసహనం, కుంగుబాటు తలెత్తవచ్చు. మూడ్‌లో తేడాలు అనిపించడం, విచారంగా ఉండటం, ఒత్తిడి ఎదుర్కోవడం తెలియకుండా ఉంటే జింక్ అవసరమని తెలుసుకోవాలి.
పొట్టలో లైనింగ్ సరిగ్గా ఉండటానికి, ఎంజైములు విడుదల కావడానికి జింక్ దోహదపడుతుంది. ఇది లోపిస్తే కడుపుబ్బరం, విరేచనాలు, ఇరిటేబుల్ బోవెల్ లక్షణాలు తలెత్తుతాయి. పోషకాలు శరీరానికి అందాలంటే జింక్ అత్యవసరం. తగ్గితే జీర్ణక్రియ సాఫీగా జరగదు. పొట్టలో బ్యాక్టీరియా సమతూకం కూడా దెబ్బతింటుంది.
ఇవీ జింక్ వనరులు
గుమ్మడి గింజలు, నువ్వులు, శనగలు, పప్పుధాన్యాలు (లెంటిల్స్), బాదం, కాజు లాంటి గింజల్లో జింక్ పుష్కలంగా దొరుకుతుంది. మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, గుడ్లు, ఆయ్‌స్టర్స్ లాంటి సముద్ర ఆహారం కూడా జింక్ గనులు. చీజ్, యోగర్ట్ లాంటి పాల పదార్థాల్లోనూ జింక్ ఉంటుంది. ముతక ధాన్యాలు, పాలకూర నుంచి మొక్కల ఆధారిత జింక్ లభిస్తుంది. ఆహారంతో కలిపి విటమిన్ సి కూడా తీసుకుంటే జింక్ బాగా వంటబడుతుంది.