Nutrients | సాధారణంగా మనం ఏ కూరగాయలను లేదా ఆకుకూరలను అయినా సరే వండుకునే తింటాం. కొన్ని రకాల కూరగాయలను పచ్చిగానే తీసుకోవచ్చు. వాటి జ్యూస్‌ను కూడా తాగవచ్చు. అయితే కొన్ని రకాల కూరగాయలను లేదా ఆకుకూరలను వండితే వాటిల్లో ఉండే చాలా వరకు విటమిన్లు, మినరల్స్ నశిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొందరు కూరలను మరీ ఎక్కువ సేపు ఉడికిస్తారు. ఇక పచ్చిగా తినాల్సిన వాటిని కూడా ఉడికించి తింటారు. కానీ అలా చేయకూడదని, అన్ని కూరగాయలను ఉడికించకూడదని, పచ్చిగానే వాటిని తినాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల కూరగాయలను ఉడికించడం వల్ల వాటిల్లో ఉండే పోషకాలను కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు.
మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ సి ఎంతగానో దోహదపడతుంది. ఇది నీటిలో కరిగే విటమిన్. అయితే విటమిన్ సి ఉండే ఆహారాలను మనం మరీ అతిగా ఉడికించకూడదు. అలా చేస్తే విటమిన్ సి ని చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. గాలి, నీరు, మంటకు ఈ విటమిన్ సులభంగా ఆవిరైపోతుంది. కనుక విటమిన్ సి ఉండే ఆహారాలను తక్కువ కడగాలి. తక్కువ సేపు ఉడికించుకోవాలి. దీంతో ఈ విటమిన్ ను కూరల్లో నుంచి పోకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా విటమిన్ బి1 ఉన్న ఆహారాలను కూడా అతిగా ఉడికిస్తే ఈ విటమిన్‌ను నష్టపోతాం. విటమిన్ బి1ను థయామిన్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా తృణ ధాన్యాలు, పప్పు దినుసుల్లో ఉంటుంది. అందువల్ల ఈ ఆహారాలను మరీ అతిగా ఉడికించకూడదు.
ఫోలేట్. దీన్నే విటమిన్ బి9 అని కూడా అంటారు. ఇది కణాలకు మరమ్మత్తులు చేయడంలో, డీఎన్ఏ సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. అయితే విటమిన్ బి9 ఉండే ఆహారాలను కూడా అతిగా ఉడికించకూడదు. ఈ విటమిన్ కూడా మంటకు సులభంగా ఆవిరవుతుంది. కనుక విటమిన్ బి9 ఉండే ఆహారాలను తక్కువగా ఉడికించాలి. అదేవిధంగా పొటాషియం ఉన్న ఆహారాలను కూడా తక్కువగా ఉడికించాలి. పొటాషియంకు వేడి తగిలితే త్వరగా ఆవిరవుతుంది. కనుక ఇది ఉండే ఆహారాలను కూడా తక్కువగా ఉడికించాలి. పొటాషియం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.
విటమిన్ బి6 కూడా ఉడికిస్తే త్వరగా ఆవిరైపోతుంది. కనుక ఈ విటమిన్ ఉండే ఆహారాలను కూడా తక్కువగా ఉడికించుకోవాలి. మనకు విటమిన్ బి6 ఎక్కువగా అరటి పండ్లు, అవకాడోల్లో లభిస్తుంది. కనుక వీటితో ఎలాంటి వంటకాలు చేయకుండా నేరుగా అలాగే తింటే మేలు జరుగుతుంది. అదేవిధంగా ఐరన్ ఉండే ఆహారాలను కూడా తక్కువగానే ఉడికించుకోవాలి. లేదంటే ఈ మినరల్‌ను మనం నష్టపోతాం. ఐరన్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. ఇలా ఆయా ఆహారాలను తక్కువగా ఉడికించుకుంటే పోషకాలను ఎక్కువగా కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు.