Pears | ఆరోగ్యంగా ఉండేందుకు, శక్తితోపాటు పోషకాలు కూడా లభించేందుకు పండ్లను తినాలని వైద్యులు చెబుతుంటారు. పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. సీజనల్‌గా అందుబాటులో ఉండే పండ్లతోపాటు ఇతర అన్ని రకాల పండ్లను కూడా తరచూ తినాలని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే చాలా మంది అనేక రకాల పండ్లను తింటుంటారు. కానీ పియర్స్ అని పిలవబడే ఈ పండ్లను చాలా తక్కువగా తింటారు. ఇవి మనకు ఫ్రూట్ స్టాల్స్‌తోపాటు సూపర్ మార్కెట్లలోనూ లభిస్తాయి. బాగా పండిన పియర్స్ పండ్లు పసుపు రంగులో ఉంటాయి. కొద్దిగా పండినవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పియర్స్ పండ్లనే బేరి పండ్లు అని కూడా పిలుస్తారు. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పియర్స్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ పియర్ పండును తినడం వల్ల సుమారుగా 6 గ్రాముల మేర ఫైబర్ పొందవచ్చు. ఈ పండ్లను ఫైబర్‌కు మంచి మూలంగా చెబుతారు. ఒక పియర్ పండును తినడం ద్వారా మనకు రోజుకు కావల్సిన ఫైబర్‌లో సుమారుగా 25 శాతం వరకు లభిస్తుంది. ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. పియర్ పండ్లు ప్రో బయోటిక్ ఆహారాల జాబితాకు చెందుతాయి. ఇవి జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చెందేలా చేస్తాయి. దీంతో జీర్ణ శక్తి పెరుగుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి.
అధికంగా బరువు ఉన్నవారు పియర్స్ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని డైటిషియన్లు చెబుతున్నారు. ఈ పండు ఒక్కదాన్ని తింటే చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. పియర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఆంథో సయనిన్స్, క్వర్సెటిన్, ఫినోలిక్ సమ్మేళనాలు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ సమస్యలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
పియర్స్ పండ్లలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. దీంతో టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే శక్తి కూడా ఈ పండ్లకు ఉందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. పియర్స్ పండ్లను తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. పియర్స్ పండ్లలో ఉండే పొటాషియం శరీరంలోని రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ పండ్లను వరంగానే చెప్పవచ్చు. రోజూ ఒక పియర్ పండును తింటుంటే బీపీ తగ్గుతుంది. స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఇలా పియర్స్ పండ్లను తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు.