ఫిట్‌గా ఉండాలనే అనుకుంటాం. అంతలోనే, సమయం లేదని బాధపడిపోతాం. ఇకనుంచి ఆ ఇబ్బంది లేదు. ఇంటినే యోగా స్టూడియోగా మార్చుకోండి. నచ్చిన యాప్స్ సాయంతో యోగాసనాలు వేయండి. ఇంకేముంది, ఏక్దమ్ ఫిట్.
ఆసనా రెబెల్, గెట్ ఇన్ షేప్
బరువు తగ్గాలనుకునేవారు, పెరగాలనుకునేవారు, శరీరాన్ని అందంగా మార్చుకోవాలనుకునేవారు.. ఎవరైనా దీన్ని ఎంచుకోవచ్చు. అవసరానికి తగిన డిజైనర్ ఆసనాలూ ఉన్నాయి. ఇంగ్లిష్‌తోపాటు అయిదు భాషల్లో యోగాసనాలు నేర్పిస్తుంది.
పాకెట్ యోగా
పాకెట్ యోగా ఫాలో అయితే మీకో మంచి గురువు దొరికినట్టే. చాప పరచుకుని, ఎదురుగా డివైజ్ పెట్టుకుని.. యాప్ ఓపెన్ చేస్తే చాలు. ఆసనాలు ఎలా వేయాలో అదే బోధిస్తుంది. ఇందులో 27 యోగా సెషన్లు ఉన్నాయి. ఏ ఆసనం ఎంత సేపు వేయాలో ఇందులో స్పష్టంగా ఉంటుంది.
యోగా వేకప్
మానసిక ప్రశాంతతకు ఉపయోగపడే చక్కని మెడిటేషన్ కోర్సులు యోగా వేకప్‌లో ఉన్నాయి. పొద్దున్నే నిద్ర లేవడం ఇబ్బంది అయితే.. యాప్‌లో అలారం కూడా పెట్టుకోవచ్చు. దినచర్యను ప్రశాంతంగా మొదలుపెట్టవచ్చు. మన శరీరాకృతిని బట్టి యోగా కోర్సును నిర్ణయిస్తుందీ యాప్. కొత్తగా నేర్చుకునేవారికి చక్కని ఎంపిక.
ది అండర్ బెల్లి
యోగా ఇన్స్ట్రక్టర్ జెస్సమిన్ స్టాన్లీ దీన్ని రూపొందించారు. ఇందులో అనేక ఆసనాలున్నాయి. మానసిక ప్రశాంతత, శరీర దారుఢ్యం .. ఇలా ప్రతి అవసరానికి ఓ మార్గం ఉంది.
యోగిఫై
వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను బట్టి, యోగా ద్వారా మనం సాధించాలనుకునే ఫలితాలను బట్టి ఆసనాలు నేర్పుతారు. మన సాధనను ట్రాక్ చేస్తూ.. ఆసనాలు సరిగా వేయకపోతే అలర్ట్ చేస్తుందీ యాప్.