World Heart Day | గుండె.. గుప్పెడంతే ఉంటుంది కానీ.. శరీరం మొత్తానికి ఆయువు పట్టు. అలాంటి గుండెను ఉరుకుల పరుగుల జీవితంలో జాగ్రత్తగా చూసుకోవాలన్నదే మర్చిపోతున్నాం. పెద్దవారిలోనే కనిపించే గుండె జబ్బులు.. ప్రస్తుతం యుక్తవయసు వారిలోనూ దర్శనమిస్తున్నాయి. సెప్టెంబర్ 29.. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా గుండెను ఎలా ఆరోగ్యంగా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యంగా ఉంటేనే మిగతా అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లుగా భావించాలి. అలాగే, మిగతా అవయవాలు సరిగా పనిచేస్తేనే.. గుండె ఆరోగ్యం ఉంటుంది. శరీరంలోని అవయవాలకు విరామ లేకుండా రక్తాన్ని పంపింగ్ చేయటమే గుండె పని. ఏండ్ల తరబడి నిరంతరాయంగా పనిచేయటం, జీవనశైలిలో మార్పులు, దురలవాట్ల కారణంగా వయసుతో బాటు గుండె పనితీరు తగ్గిపోతున్నది. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించకపోతే గుండెపోటుకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీవనశైలి ప్రథమ శత్రువు
ప్రస్తుతం యువతలో ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సమస్యలు వస్తున్నాయి. మనలో చాలా మంది చిన్న వయసు నుంచి యధేచ్చగా చిరుతిండ్లకు, ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటుపడిపోయి యుక్తవయసు వచ్చాక ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. రోడ్డుపై దొరికే ఆహారాలను ఇష్టపడుతూ అమ్మ చేతి వంటను దూరం పెడుతున్నారు. ఫలితంగా ఆరోగ్య సమస్యలకు దగ్గరవుతున్నారు.
రెండోది ఎలాంటి వ్యాయామం చేయకుండా బలాదూర్‌గా తిరగడం కూడా గుండెకు ముప్పే. రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి. అలా అని గంటలు గంటలు వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం అర్ధ గంటకు తక్కువ కాకుండా ఇంటి వద్దనే వాకింగ్, రన్నింగ్, వార్మప్ చేయడం, తోటపనిలో నిమగ్నమవడం వంటివి సరిపోతాయి.
మూడోది పేలవమైన నిద్ర కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నా యువత మాత్రం అలసటతోనే ఉంటున్నారు. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లతో కుస్తీ పడుతూ ఏ రాత్రికో నిద్ర పోవడం.. నిర్ణీత వేళలు నిద్ర లేకపోవడం వంటి వాటి వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా గుండె జబ్బులు వస్తుంటాయి.
నాలుగోది పోషకాల్లేని ఆహారాలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ, అవి ఎంత ఆరోగ్యపరంగా సమస్యల్ని తీసుకొస్తున్నాయో పట్టించుకోవడం లేదు. ఉప్పు, చక్కెర, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఆహారాలను అమితంగా ఇష్టపడుతున్నారు. ఫలితంగా మధుమేహం, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, ఊబకాయం, స్లీప్ ఆప్నియా సిండ్రోమ్, అథెరోస్క్లెరోసిస్ వంటి జీవక్రియ సిండ్రోమ్‌లకు దగ్గరవుతున్నారు.
ఐదోది చెడు అలవాట్లు.. ప్రస్తుత యువతలో సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కంజూమింగ్ అనేది చాలా క్యాజువల్ విషయాలుగా తయారయ్యాయి. ఏ యువకుడి చేతిలో చూసినా సిగరెట్ ఉండటం ఫ్యాషన్‌గా తయారైపోయింది. సిగరేట్ తాగితేనే గొప్పవాళ్లమనే భావనలో యువత మునిగితేలుతున్నది. రాత్రి కాగానే మద్యం బాటిళ్లను ముద్దాడుతున్నారు. ఫలితంగా గుండెకు లేనిపోని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నారు. ఈ రెండూ గుండెకు బద్ధ శత్రువులన్నది యువత మరిచిపోవద్దు.
గుండె జబ్బులు – ఒత్తిడి
గుండెజబ్బులకు, ఒత్తిడికి సంబంధమున్నది. ఎవరి జీవితంలోనైనా ఎంతో కొంత ఒత్తిడి సహజమే. అయితే ఆధునిక జీవితంలో ఒత్తిడి ఒక భాగంగా మారిపోయింది. ఒత్తిడి అదేపనిగా పెరిగిపోతూ ఉంటే.. అది ఉద్వేగ సమస్యలకు, మానసిక సమస్యలకు.. ఆ తర్వాత శారీరక సమస్యలకు దారి తీస్తుంది. అలాంటి శారీరక సమస్యల్లో గుండెజబ్బు ఒకటి. తీవ్ర ఒత్తిడి గుండె కండరాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపి టుకోట్సుబో కార్డియో మయోపతి వంటి గుండె పనితీరు విఫలమయ్యే పరిస్థితికి దారితీసే ప్రమాదం కూడా ఉన్నది.
గుండె ఆరోగ్యానికి ఆహారాలు
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం పోషకాలతో నిండి ఉండేలా భోజనం ప్లేట్‌ను సిద్ధం చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు గుండె ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పొటాషియం ఎక్కువగా లభించే పండ్లతో పాటు ఆలుగడ్డ, పాలకూర, టమాట, అరటి, బొప్పాయి, నారింజ, డ్రై ఫ్రూట్లను తింటూ ఉండాలి. కాల్షియం ఎక్కువగా దొరికే తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు, పచ్చని ఆకుకూరలు, బాదం పప్పులు తినాలి. చేపలు, ఆవనూనె, వాల్నట్స్, గోధుమ, రాజ్మా, ఆవాలు, సోయాబీన్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. కివీ పండు గుండెకు ప్రయోజనకారి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా లభించే చేపలను అధికంగా తినడం అలవాటు చేసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.