న్యూఢిల్లీ : పల్లీలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని పలు అధ్యయనాలు వెల్లడించగా వీటిని నిత్యం తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ప్రముఖ డైటీషియన్, హాలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్ రజత్ జైన్ వివరించారు. వేరుశనగగానూ వ్యవహరించే పల్లీలు శక్తిలో బాదంతో సమానమని, వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకర కొవ్వులు ఉంటాయని మన శరీరానికి అవసరమైన 30 పోషకాలు ఉంటాయని జైన్ తెలిపారు.
పల్లీల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందని ఇది ఆరోగ్యానికి ఉపకరిస్తుందని చెప్పారు. రోజూ 30 నుంచి 40 గ్రాముల పల్లీలు సరిపోతాయని ఇది బరువు తగ్గేందుకు కూడా దారితీస్తుందని జైన్ పేర్కొన్నారు. ఆకలిని పోగొట్టి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. సాయంత్రం రోజూ స్నాక్ ఐటెంగా ఉడికించిన పల్లీలను తీసుకోవచ్చని తెలిపారు. పల్లీల్లో ఉండే ఆరోగ్యకర కొవ్వులతో పాటు మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, కాపర్, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పల్లీలు లో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగిఉండటంతో మధుమేహ రోగులూ నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చు. పల్లీల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. తీవ్ర వ్యాధుల బారిన పడకుండా ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలు ఉపకరిస్తాయి.