Lemon Leaves | నిమ్మకాయల వల్ల మనకు ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నిమ్మరసాన్ని చాలా మంది వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. నిమ్మకాయల్లోని రసంలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధులను దరి చేరకుండా చేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. అయితే నిమ్మకాయలు మాత్రమే కాదు, నిమ్మ చెట్టు ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. నిమ్మ ఆకులను ఉపయోగించి అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. నిమ్మ ఆకుల్లో సిట్రిక్ యాసిడ్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ మనకు రోగాలు రాకుండా చూస్తాయి. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
నిమ్మ ఆకులను కొన్ని తీసుకుని కొద్దిగా నలిపి నీటిలో వేసి మరిగించాలి. 10 నిమిషాలు మరిగాక స్టవ్‌ను ఆఫ్ చేసి నీళ్లను వడకట్టి ఆ నీళ్లు గోరు వెచ్చగా ఉండగానే కొద్దిగా తేనె కలిపి తాగేయాలి. ఈ నీళ్లను తాగుతుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట ఈ నీళ్లను తాగితే మనస్సుకు విశ్రాంతి కలిగి నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఈ నీళ్లను సేవించడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు మాత్రం ఈ నీళ్లను సేవించకూడదు. నిమ్మ ఆకులను కొన్ని తీసుకుని కొద్దిగా నలిపి చర్మం కనిపించే ప్రాంతాల్లో రాయాలి. దీంతో దోమలు దూరంగా పోతాయి. అలాగే ఇంట్లో కిటికీలు, తలుపులు, ఇతర ప్రదేశాల్లో నిమ్మ ఆకులను నలిపి చిన్నపాటి గిన్నెలో ఉంచితే ఈగలు, పురుగులు, బొద్దింకలు రాకుండా అడ్డుకోవచ్చు.
నిమ్మ ఆకులను కొద్దిగా నలిపి నీటిలో వేసి బాగా కలిపి ఆ నీళ్లతో స్నానం చేయాలి. దీంతో చెమట వాసన రాదు. దుర్వాసన రాకుండా అడ్డుకోవచ్చు. శరీరం చక్కని వాసనను అందిస్తుంది. ఇది మనస్సును కూడా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. అలాగే చర్మం సంరక్షించబడుతుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోయి కాంతివంతంగా మారుతుంది. చర్మం మెరుస్తుంది. సహజసిద్ధమైన నిగారింపును పొందుతుంది. కొన్ని నిమ్మ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఆ నీళ్లను సగం బకెట్ గోరు వెచ్చని నీటిలో పోసి కలపాలి. అనంతరం ఆ బకెట్లో పాదాలను మునిగేలా 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తుంటే పాదాల కండరాలకు ప్రశాంతత లభిస్తుంది. పాదాలు, కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిమ్మ ఆకులను సహజసిద్ధమైన రిఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. నిమ్మ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను సేకరించి ఒక స్ప్రే బాటిల్లో పోసి ఉపయోగించాలి. ఇంట్లో దుర్వాసన వస్తున్న చోట్లలో ఈ నీళ్లను స్ప్రే చేయాలి. దీంతో వాసన పోతుంది. రూమ్ అంతా పరిమళంతో నిండిపోతుంది. నిమ్మ ఆకులను బాగా నూరి మెత్తని పేస్టులా చేసి అందులో కాస్త తేనె, పెరుగు వేసి కలిపి ఫేస్ ప్యాక్‌లా తయారు చేయాలి. దీన్ని ముఖానికి రాసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖంపై ఉండే మృత చర్మ కణాలు తొలగిపోతాయి. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ముఖం మృదువుగా మారుతుంది. చర్మంపై అలర్జీలు వచ్చే వారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసి ఈ చిట్కాను ఉపయోగించాలి. నిమ్మ ఆకులను పేస్ట్‌లా చేసి అందులో పెరుగు కలిపి జుట్టుకు పట్టించి కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే చుండ్రు పోతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఇలా నిమ్మ ఆకులతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.