Tomato Soup | చలికాలం చాలా మంది సహజంగానే తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే వేసుకునే దుస్తులతోపాటు తీసుకునే ఆహారంలోనూ అనేక మార్పులు చేస్తుంటారు. ఇక ఆహారాల విషయానికి వస్తే వారు సూప్‌లను బాగా తాగుతుంటారు. సూప్‌లను చలికాలంలో తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. దీంతోపాటు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే చలికాలంలోనే కాకుండా ఇతర ఏ సీజన్లో అయినా సరే టమాటా సూప్‌ను తాగితే మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా టమాటా సూప్‌ను రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు తీసుకుంటే మంచిది. దీంతో అనేక పోషకాలను పొందవచ్చని, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. టమాటా సూప్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వారు అంటున్నారు.
టమాటా సూప్‌లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక టమాటా ద్వారా మనకు సుమారుగా 7 గ్రాముల మేర కార్బొహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్, 1.6 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. అలాగే టమాటాల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్లు సి, కె, ఇ కూడా టమాటాల్లో సమృద్ధిగానే ఉంటాయి. అలాగే క్యాల్షియం, సెలీనియం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. మనకు రోగాలు రాకుండా చూస్తాయి. టమాటాలను ఉడకబెట్టడం వల్ల వాటిల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శాతం పెరుగుతుంది. ఇది ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి.
టమాటాల్లో ఉండే లైకోపీన్, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. టమాటా సూప్ తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. టమాటాల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. టమాటా సూప్‌ను తాగుతుంటే చర్మం సైతం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారి, మృదువుగా ఉంటుంది. చలికాలంలో టమాటా సూప్‌ను తాగితే చర్మం పగలకుండా చూసుకోవచ్చు. చర్మం తేమగా ఉంటుంది.
టమాటాల్లో ఉండే లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్మూలిస్తుంది. దీంతో కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. అలాగే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. టమాటాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. టమాటా సూప్ ను రోజూ ఉదయం తాగుతుంటే మలబద్దకం సమస్య ఉండదు. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఈ సీజన్లో టమాటా సూప్‌ను తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.