Cycling | మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు వ్యాయామం కూడా చేయాల్సిందే. పూర్వం రోజుల్లో అయితే చాలా మంది సైకిళ్లను వాడేవారు. ఎంత దూరం అయినా సరే సైకిల్ మీదనే ప్రయాణించేవారు. కనుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. అయితే సైకిల్ తొక్కడం అన్నది గొప్ప వ్యాయామం అని చెప్పవచ్చు. మీరు మీ ఇంట్లో స్టేషనరీ సైకిల్‌ను ఏర్పాటు చేసుకుని తొక్కినా లేదా మామూలు సైకిల్‌ను తొక్కినా అనేక లాభాలు కలుగుతాయి. రోజూ కనీసం 15 నిమిషాల పాటు సైకిల్ తొక్కినా చాలు, అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. సైక్లింగ్ అన్నది చక్కని వ్యాయామం అని, దీని వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం జరుగుతుందని వారు అంటున్నారు. సైకిల్ తొక్కడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు.
సైకిల్ తొక్కడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. శరీరంలోని అన్ని భాగాలలో ఉండే కండరాలు నిర్మాణమవుతాయి. దీంతో కండరాలు బలంగా ఉంటాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. చక్కని దేహాకృతి కూడా సొంతం అవుతుంది. అలాగే రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. దీంతో ఊపిరితిత్తులు మరింత సమర్థవంతంగా ఆక్సిజన్‌ను శరీరంలోని భాగాలకు రవాణా చేస్తాయి. దీంతో శరరీంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి శక్తి లభిస్తుంది. ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా, ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట అనేవి ఉండవు. రోజంతా ఎంత పనిచేసినా అలసిపోకుండా ఉంటారు.
కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు సైకిల్‌ను తొక్కడం అలవాటు చేసుకుంటే ఆయా నొప్పుల నుంచి సులభంగా బయట పడవచ్చు. సైకిల్ తొక్కడం వల్ల కీళ్లకు సపోర్ట్ లభిస్తుంది. దీంతో కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా భాగాల్లో ఉండే వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక సైక్లింగ్ అనేది గొప్ప కార్డియో వ్యాయామం అని చెప్పవచ్చు. దీని వల్ల గుండెకు చక్కని వ్యాయామం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రోజూ సైకిల్‌ను తొక్కితే హైబీపీ తగ్గుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
అధిక బరువు తగ్గాలని అనుకునేవారికి సైక్లింగ్ గొప్ప వరం అని చెప్పవచ్చు. సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో కీలక భాగాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు రోజూ సైకిల్ తొక్కడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. శరీరం నాజూగ్గా తయారవుతుంది. సన్నగా మారుతారు. స్లిమ్ సైజ్ లోకి వచ్చేస్తారు. ఆయా భాగాల్లో ఉండే కొవ్వు కరిగిపోయి స్లిమ్‌గా, క్యూట్‌గా కనిపిస్తారు. ఇక సైకిల్ తొక్కడం వల్ల మానసిక ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో మానసిక ప్రశాంతత లభించి హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇలా రోజూ సైకిల్ తొక్కడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.