Sanitary Products | మహిళల నెలసరి సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ప్రతి నెలా అవసరమైనవే అయినప్పటికీ, వాటిని ఎంపిక చేసేటప్పుడు కేవలం సౌకర్యం మాత్రమే కాకుండా ఆరోగ్య భద్రతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జీవితకాలంలో వేల గంటల పాటు ఈ ఉత్పత్తులను ఉపయోగించాల్సి వచ్చే నేపథ్యంలో వాటి తయారీ పదార్థాలు, సువాసన రసాయనాలు, గాలి ప్రసరణ సామర్థ్యం, చర్మానికి కలిగే ఇబ్బందులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం వంటి అంశాలపై అవగాహన ఉండటం అవసరమని నిపుణులు చెబుతున్నారు. నెలసరి పరిశుభ్రత ఉత్పత్తుల విషయంలో సువాసన కలిగిన వెట్ వైప్స్, ప్యాంటీ లైనర్లకు అత్యంత తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. వీటిలో ఉండే సుగంధ ద్రవ్యాలు, ప్రిజర్వేటివ్‌లు యోని సహజ పీహెచ్ సమతుల్యతను దెబ్బతీసి తరచూ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ వెజినోసిస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెష్ అనే పదం మార్కెటింగ్ కోసం ఉపయోగించేదే తప్ప వైద్యపరమైన ప్రయోజనాన్ని సూచించదని పేర్కొంటున్నారు.
ట్యాంపాన్లను కూడా జాగ్రత్తగా ఉపయోగించాల్సిన ఉత్పత్తులుగా పేర్కొంటున్నారు. సువాసన లేని ట్యాంపాన్లనే ఎంచుకోవాలని, నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు వాటిని ఉంచితే అరుదైనప్పటికీ తీవ్రమైన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు. అందువల్ల వాటిని సమయానికి మార్చడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. సాధారణ శానిటరీ ప్యాడ్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, వాటి ప్లాస్టిక్ వెనుక పొర వేడి, తేమను ఎక్కువసేపు బంధించి ఉంచడం వల్ల చర్మంపై దద్దుర్లు, అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. ఇవి ఉపయోగించడానికి అనుకూలమైనప్పటికీ అత్యుత్తమ ఎంపికగా చెప్పలేమని, పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు.
పీరియడ్ అండర్వేర్ సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ, వాటి నాణ్యత పూర్తిగా బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్రాండ్ల ఉత్పత్తుల్లో పీఎఫ్ఏఎస్ (PFAS) అనే ఫారెవర్ కెమికల్స్ గుర్తించిన సందర్భాలు ఉండటంతో, కొనుగోలు చేసే ముందు బ్రాండ్ విశ్వసనీయతను తప్పనిసరిగా పరిశీలించాలి. పునర్వినియోగం చేయగల క్లాత్ ప్యాడ్లు ఆరోగ్యపరంగా మంచి ఎంపికలలో ఒకటిగా ఉంటాయి. మృదువైన, గాలి సులభంగా ప్రసరించే వస్త్రంతో తయారవడం వల్ల చర్మానికి తక్కువ చికాకు కలిగించి, సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే వాటిని ప్రతి వినియోగం తర్వాత శుభ్రంగా ఉతికి, పూర్తిగా ఆరబెట్టి ఉపయోగించడం చాలా అవసరం.
ఆర్గానిక్, బ్లీచ్ చేయని కాటన్ ప్యాడ్లు కూడా మెరుగైన ఎంపికగా ఉంటాయి. వీటిలో జెల్స్, బ్లీచింగ్ రసాయనాలు, సువాసన పదార్థాలు లేకపోవడం వల్ల చర్మానికి తక్కువ హాని కలిగే అవకాశం ఉంటుంది. మెడికల్ గ్రేడ్ సిలికాన్‌తో తయారైన మెన్స్ట్రువల్ కప్‌ను అత్యుత్తమ ఎంపికగా చెప్పవచ్చు. ఇది పునర్వినియోగం చేయదగినది, సువాసన పదార్థాలు లేదా బ్లీచింగ్ రసాయనాలు ఉండవు. పరిశుభ్రంగా శుభ్రపరుచుకుని సరిగ్గా ఉపయోగిస్తే ఇది సురక్షితంగా ఉండటంతోపాటు దీర్ఘకాలంలో ఖర్చును కూడా తగ్గిస్తుంది. పరిశుభ్రమైన పదార్థాలతో తయారైన, సువాసనలేని ఉత్పత్తులను ఎంచుకోవడం, వాటిని సమయానికి మార్చడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. అందరికీ ఒకే ఉత్పత్తి సరిపోదు, తమ శరీరానికి అనుకూలమైన ఎంపికను అవగాహనతో చేసుకోవడం దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో కీలకం.