Pregnancy | గర్భధారణ మహిళల జీవితంలో ఆనందకరమైన దశ అయినప్పటికీ, ఇది భావోద్వేగ, శారీరక ఒత్తిడికి కూడా కారణమవుతుంది. గర్భధారణ సమయంలో దీర్ఘకాలిక ఒత్తిడి నిద్రలేమి, అధిక రక్తపోటు, ఆకలి తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ముందస్తు ప్రసవం (ప్రి-టర్మ్ బర్త్), తక్కువ బరువుతో శిశువు జననం వంటి ప్రమాదాలకూ కారణమవుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల ఒత్తిడిని నియంత్రించడం ప్రీనేటల్ కేర్లో కీలక భాగంగా మారింది. గర్భధారణ అనేది శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా మార్పులు తీసుకువచ్చే ప్రయాణం. హార్మోన్ల మార్పులు, శరీర అసౌకర్యం, శిశువు ఆరోగ్యం, ప్రసవంపై ఆందోళనలు వంటివి ఒత్తిడికి కారణమవుతాయి. కొంతమేర ఒత్తిడి సహజమైనదే అయినప్పటికీ అధిక ఒత్తిడి తల్లి, గర్భంలోని శిశువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కార్టిసోల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. ఇవి తల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు పరోక్షంగా శిశువు అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తాయి. నిద్రలేమి, రక్తపోటు పెరగడం, ఆకలి తగ్గడం వంటి సమస్యలు కలుగుతాయి. అలసట పెరిగే కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతుంది. కనుక నిద్రకు ప్రాధాన్యం ఇవ్యాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. అవసరమైతే పగటిపూట చిన్నపాటి విశ్రాంతి తీసుకోవడం మంచిది. నిద్రకు ముందు రిలాక్సేషన్ అలవాట్లు ఏర్పరుచుకోవడం చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటే మూడ్ కూడా స్థిరంగా ఉంటుంది.
చిన్న పరిమాణాల్లో తరచుగా ప్రోటీన్లు, ధాన్యాలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అలసట, చిరాకు తగ్గి ఒత్తిడి తగ్గుతుంది. తగిన విశ్రాంతి తీసుకుంటూనే శారీరకంగా చురుకుగా ఉండాలి. డాక్టర్ సూచించిన వ్యాయామాలతో పాటు నడక, ప్రీనేటల్ యోగా, స్ట్రెచింగ్ వంటి కార్యకలాపాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇవి ఎండోర్ఫిన్స్ విడుదలకు సహాయపడి మానసిక ప్రశాంతతను పెంచుతాయి. వీటితో పాటు భర్త, కుటుంబ సభ్యులు లేదా వైద్యులతో మాట్లాడటం ద్వారా భావోద్వేగ ఒత్తిడి తగ్గుతుంది. ప్రసవం, శరీర మార్పులు, శిశువు సంరక్షణపై ఉన్న భయాలను వారితో పంచుకోవడం మంచిది.
ఎక్కువ ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి లక్షణాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతే వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది. ఇది తల్లి, శిశువు ఇద్దరి ఆరోగ్యానికి ఉపయోగకరం. శాంతంగా ఉన్న తల్లి ఆరోగ్యకరమైన గర్భధారణకు సూచిక. అందువల్ల గర్భిణీలు విశ్రాంతికి సమయం కేటాయిస్తూ, తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అత్యంత ముఖ్యమని వైద్యులు తెలియజేస్తున్నారు.