Health Tips | సాధారణంగా పురుషుల కన్నా మహిళలు వ్యాయామం తక్కువ చేస్తారు. ఆల్రెడీ ఇంటి పనులు, ఆఫీసు, పిల్లలతోనే టైం గడిచిపోతుంది. అందుకే ఎక్కువ మంది ప్రత్యేకంగా వ్యాయామం మీద శ్రద్ధ పెట్టరు. కానీ కొన్ని పరిశోధనలు, అధ్యయనాల్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వ్యాయామం చేయడం వల్ల పురుషుల కన్నా మహిళలకే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్టియాలజీకి చెందిన జర్నల్ ఇటీవల దీని గురించి ప్రచురించింది. ఆ సంస్థకు చెందిన పరిశోధకులు 1997 నుంచి జాతీయ ఆరోగ్య ఇంటర్వ్యూ సర్వేలలో పాల్గొన్న వ్యాయామం చేసే 40లక్షల 12వేల మంది స్త్రీ, పురుషుల వివరాలను సేకరించారు. స్టడీలో భాగంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేసే మహిళలు, వారానికి కనీసం 2 గంటలు / 75నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేసే మహిళలు, వ్యాయామం చేయని మహిళలపై స్టడీ చేసింది. ఇందులో వారు కనిపెట్టిన విషయం ఏంటంటే.. ఎక్సర్సైజ్ చేయని వారితో పోలిస్తే.. చేసే మహిళల్లో అనారోగ్య సమస్యలు / మరణించే ప్రమాదం 24% తక్కువగా ఉందట. అలాగే పురుషుల విషయంలో చేసిన స్టడీలో వీరికి అనారోగ్య సమస్యలు లేదా మరణించే ప్రమాదం 15% తక్కువగా ఉందని తేలింది.
దీన్ని బట్టి చూస్తే వ్యాయామం చేయడం విషయంలో పురుషులకు మహిళలకు 18% తేడా ఉంది. అంటే మహిళలతో పోలిస్తే.. పురుషులు ఆరోగ్యంగా ఉండాలన్నా.. ఆయుష్షు పెంచుకోవాలన్నా స్త్రీల కన్నా.. పురుషులు ఎక్కువ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు స్త్రీలు వారానికి 75నిమిషాల పాటు వ్యాయామం చేస్తే వచ్చే ప్రయోజనాలు.. పురుషులు 140నిమిషాల పాటు చేస్తే కలుగుతాయని ఈ స్టడీ చేసిన పరిశోధకులు చెబుతున్నారు.
తరచుగా వ్యాయామం చేసే మహిళలల్లో గుండె జబ్బుల ప్రమాదం 36% తగ్గుతుంది. అదే పురుషుల్లో కేవలం 14% మాత్రమే తగ్గుతుంది. ఎందుకంటే వ్యాయామానికి స్పందించే సమర్ధత పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా గుండె ఆరోగ్యం, మరణాల విషయంలో. అలాగే కండరాల్లోని కొన్ని భాగాల్లో చిన్న రక్తనాళాలు స్త్రీలకు ఎక్కువ ఉంటాయి. వ్యాయామం చేసే సమయంలో ఇవి గుండెకు రక్తం మరియు ఆక్సిజన్ సరఫరా సవ్యంగా జరిగేందుకు తోడ్పడతాయి. దీంతో పాటుగా పురుషులతో పోలిస్తే మహిళలలో ఈస్ట్రోజెన్ అనే హర్యోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.