హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గణేశ్ ఉత్సవాల్లో అత్యంత కీలక ఘటం లడ్డూ వేలం. శుక్రవారం జరిగిన వివిధ వేలం పాటల్లో పలువురు లక్షలు వెచ్చించి విఘ్నేశ్వరుడి లడ్డూను కైవసం చేసుకున్నారు. లడ్డూవేలం అనగానే మొదట గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడే. ఈ లడ్డూను దక్కించుకోవడానికి 9 మంది పాల్గొనగా అందులో 5 కంపెనీలు సైతం పోటీపడ్డాయి. బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సామ ప్రణీత్‌రెడ్డి దక్కించుకున్నారు.
నిరుటి కంటే ఈ సారి రూ.4లక్షలు అధికంగా పలికింది. లడ్డూను నిరుపేదలు, అనాథపిల్లలకు పంచుతానని ప్రణీత్‌రెడ్డి చెప్పారు. బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో 5 కిలోల లడ్డూను శక్తిమాన్ గ్రూప్ సభ్యులు రూ. 1.01కోట్లకు దక్కించుకున్నారు. అత్తాపూర్‌లోని పురాతన పోచమ్మ ఆలయం వద్ద నవశక్తి భక్త సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో గుమ్మడి బ్రదర్స్‌కు చెందిన భూపాల్‌రెడ్డి రూ.13.21లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ సేవాలాల్ నగరంలో రూ.11.50 లక్షలకు గణనాథుని లడ్డూను ఎస్. శంకర్ నాయక్ దంపతులు దక్కించుకున్నారు. మణికొండలోని ఆదిత్య అథేనా అపార్ట్మెంట్ లడ్డూను రూ.9.35 లక్షలకు కృష్ణంరాజు దక్కించుకున్నారు. కూకట్‌పల్లిలో శ్రీ వినాయక భక్త బృందం లడ్డూ వేలంపాటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు రూ.7.11 లక్షలకు దక్కించుకున్నాడు.
