Copper | మన శరీరానికి కావల్సిన మినరల్స్ అనగానే ముందుగా మనకు క్యాల్షియం, పొటాషియం వంటివి గుర్తుకు వస్తాయి. అయితే అన్ని రకాల మినరల్స్ మనకు అవసరమే. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, అన్నింటినీ మనం సమానంగా లభించేలా చూసుకోవాలి. ఈ క్రమంలోనే కాపర్‌ను కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాపర్ అంటే రాగి పాత్రలో నీటిని పోసి తాగితే చాలని, రాగి లభిస్తుందని అనుకుంటారు. అయితే అది వాస్తవమే అయినప్పటికీ అలా లభించే రాగి చాలా స్వల్ప పరిమాణంలో ఉంటుంది. కనుక రాగి మనకు సరిపోయినంతగా లభించేలా చూసుకోవాలి. అందుకు గాను మనకు పలు ఆహారాలు దోహదం చేస్తాయి. రాగి ఉండే ఆహారాలను తరచూ తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. పలు వ్యాధులను నయం చేసేందుకు కూడా రాగి మనకు ఉపయోగపడుతుంది. ఇది మనకు చాలా సులభంగా లభిస్తుంది.
ఆలుగడ్డలు, చిలగడ దుంపలు, గుమ్మడికాయ విత్తనాలు, చియా సీడ్స్, పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్, డార్క్ చాకొలెట్, మటన్ లివర్, ఆల్చిప్పలు, పుట్ట గొడుగులు, నువ్వులు, రొయ్యలు తదితర ఆహారాలను తరచూ తీసుకోవడం ద్వారా మనకు రాగి లభిస్తుంది. ఇక రాగి మనకు వయస్సును బట్టి అవసరం అవుతుంది. 19 ఏళ్లకు పైబడిన వారికి అయితే రాగి రోజుకు 900 మైక్రోగ్రాముల మోతాదులో అవసరం అవుతుంది. గర్భిణీలకు 1000 మైక్రోగ్రాములు, పాలిచ్చే తల్లులకు రోజుకు 1300 మైక్రోగ్రాముల మోతాదులో కాపర్ కావల్సి ఉంటుంది. ఆయా ఆహారాలను తీసుకోవడం ద్వారా రాగి మనకు తగినంతగా లభించేలా చూసుకోవచ్చు. అయితే రాగి మన శరీరంలో ఏం చేస్తుంది, ఇది మనకు ఎందుకు అవసరం అవుతుంది.. అనే విషయాలు చాలా మందికి తెలియవు. వీటిని వైద్యులు వివరిస్తున్నారు.
మన శరీరానికి కావల్సిన అనేక మినరల్స్‌లో రాగి ఒకటి. ఇది అనేక జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు దోహదం చేస్తుంది. పలు వ్యాధులు రాకుండా చూస్తుంది. రాగి వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రాగి ఉండే ఆహారాలను తింటుంటే మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. పిల్లలు అయితే చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. రాగి ఉండే ఆహారాలను తింటుంటే పెద్దలు మతిమరుపు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు అల్జీమర్స్ రాకుండా ఉంటుంది. అలాగే రాగి వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. నీరసం, అలసట తగ్గిపోతాయి. బద్దకం ఉండదు.
రాగి వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను తగ్గించుకోవచ్చు. అలాగే రోగాలు, ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. ముఖ్యంగా జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. రాగి వల్ల శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ తొలగించబడతాయి. దీని వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. అలాగే చర్మం సంరక్షించబడుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. కనుక రాగి ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.