Calcium Requirement And Foods | మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. శరీరంలో అనేక విధులు సక్రమంగా నిర్వహించబడేందుకు సహాయం చేస్తుంది. ఎముకల నిర్మాణానికి దోహదం చేస్తుంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మన శరీరంలో 99 శాతం మేర క్యాల్షియం ఎముకలు, దంతాల్లోనే ఉంటుంది. అయితే క్యాల్షియం లోపం ఉంటే ఎముకలు, దంతాలు బలహీనంగా మారుతాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధ వ్యాధులు వస్తాయి. దీంతో ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక మన శరీరంలో క్యాల్షియం స్థాయిలు తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వయస్సు మీద పడుతున్నవారు క్యాల్షియం ఉండే ఆహారాలను ఎక్కువగా తింటుండాలి. లేదంటే శరీరం బలహీనంగా మారుతుంది.
క్యాల్షియం వల్ల కండరాలు ప్రశాంతంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో తగినంత క్యాల్షియం లేకపోతే కండరాలు సైతం బలహీనంగా మారుతాయి. కండరాల నొప్పులు వస్తాయి. నాడీ మండల వ్యవస్థకు, మెదడు పనితీరుకు కూడా క్యాల్షియం దోహదం చేస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు, శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగకుండా ఉండేందుకు క్యాల్షియం సహాయం చేస్తుంది. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లకు, ఎంజైమ్‌ల చర్యలకు కూడా క్యాల్షియం ఎంతగానో అవసరం అవుతుంది. కనుక క్యాల్షియం లోపం రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అందకు గాను క్యాల్షియం ఉండే ఆహారాలను రోజూ తింటుండాలి. దీంతో అన్ని జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
క్యాల్షియం మనకు అనేక ఆహారాల్లో లభిస్తుంది. పాలు, చీజ్, పెరుగు, సోయా పాలు, బాదం పాలు, ఓట్స్ పాలు, ఆవు పాలు, పాలకూర, తోటకూర, బచ్చలికూర, చేపలు, సోయా టోఫు, పప్పు దినుసులు, గసగసాలు, నువ్వులు, చియా విత్తనాలు, బాదంపప్పుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కనుక వీటిని రోజూ తింటుంటే క్యాల్షియం లోపం నుంచి బయట పడవచ్చు. ఇక 4 నుంచి 8 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులకు రోజుకు 1000 మిల్లీగ్రాముల మోతాదులో క్యాల్షియం అవసరం ఉంటుంది. అలాగే 9 నుంచి 18 ఏళ్లు ఉన్నవారికి 1300 మిల్లీగ్రాములు, 19 నుంచి 50 ఏళ్లు ఉన్నవారికి 1000 మిల్లీగ్రాములు, 51 ఏళ్లు పైబడిన వారికి రోజుకు 1200 మిల్లీగ్రాముల మోతాదులో క్యాల్షియం అవసరం ఉంటుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు రోజుకు 1300 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభించేలా చూసుకోవాలి.
క్యాల్షియం లోపం ఉన్నవారికి వైద్యులు పరీక్షలు చేసి నిర్దారణ చేస్తారు. క్యాల్షియం లోపం ఉంటే ఎముకలు తరచూ విరగడం లేదా నొప్పులు ఉంటాయి. కిడ్నీ స్టోన్లు తరచూ ఏర్పడుతాయి. క్యాల్షియం లోపం ఉన్నట్లు పరీక్షల్లో తేలితే వైద్యులు ట్యాబ్లెట్లను సైతం ఇస్తారు. రోజుకు 2000 మిల్లీగ్రాముల మోతాదులో లేదా అంతకన్నా తక్కువ మోతాదులో వైద్యులు సూచించిన కాలం పాటు క్యాల్షియం ట్యాబ్లెట్లను వాడాల్సి ఉంటుంది. క్యాల్షియం ట్యాబ్లెట్లను డాక్టర్ సూచన లేకుండా వాడకూడదు. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉంటే కడుపు నొప్పి, విరేచనాలు, కిడ్నీ స్టోన్లు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ ఆయా ఆహారాలను తీసుకుంటే క్యాల్షియం లోపం నుంచి బయట పడవచ్చు.