Parenting | నమస్తే డాక్టర్! మా పాప మూడు నెలలు ముందుగా జన్మించింది. పుట్టినప్పుడు కేవలం కిలో బరువుంది. ఇంక్యుబేటర్లో ఉంచారు. బిడ్డకు శ్వాస ఇబ్బంది తలెత్తింది. వైద్యుల సహకారంతో అన్ని రకాల చికిత్సలూ అందించాం. పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడే బిడ్డకు రెండుసార్లు కంటి పరీక్షలు చేశారు. మళ్లీ చేయాలని చెబుతున్నారు. ప్రీమెచ్యూర్ బేబీకి ఇన్ని కంటి పరీక్షలు అవసరమా? భవిష్యత్తులో మా బిడ్డ కంటిచూపునకు ఏమైనా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందా? మేం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయగలరు.
-ఓ పాఠకురాలు
మూడు నెలలు ముందుగా పుట్టిన మీ అమ్మాయి.. ఆరోగ్యంగా ఇంటికి చేరడం ఆనందం కలిగించే విషయం. అయితే, ప్రీమెచ్యూర్ పిల్లలకు రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వాళ్లకు కంటి పరీక్షలు తప్పకుండా చేయించాల్సిందే! ఎందుకంటే.. కంటి వెనుక ఉండే కంటి తెర (రెటీనా) రక్తనాళాలు పిండస్థ దశలో ఎదిగి 36 వారాల వరకు, ఆ రక్తనాళాలు అభివృద్ధి చెందుతాయి. ప్రీమెచ్యూర్గా పుట్టిన బిడ్డకు రక్తనాళాలు పూర్తిస్థాయిలో వృద్ధి చెందవు. అవి క్రమంగా పెరుగుతుంటాయి. అయితే నెలల ముందుగానే పుట్టడం వల్ల రకరకాల కారణాల నేపథ్యంలో.. ఈ రక్తనాళాలు పెరగాల్సిన క్రమంలో కాకుండా, ఎగుడుదిగుడుగా పెరిగే అవకాశం ఉంటుంది.
కొన్నిసార్లు అవి కంటిలోపల భారంగా మారి, రెటీనా తెరను లాగేయొచ్చు. దీన్నే రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. అలాగే బ్లీడింగ్ కావొచ్చు. ఈ ఇబ్బంది ప్రధానంగా ప్రీమెచ్యూర్ పిల్లల్లో కనిపిస్తుంది. దీనిని రెటినోపతీ ఆఫ్ ప్రీమెచ్యూర్ అంటారు. ఈ బిడ్డలకు సరైన సమయంలో కంటి పరీక్షలు చేయించకపోతే.. ఏదైనా సమస్య ఉన్నా గుర్తించలేకపోవచ్చు. దాని పర్యవసానంగా వాళ్లు పూర్తిగా చూపు కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇలాంటి ఇబ్బంది తలెత్తవద్దు అనుకుంటే.. బిడ్డకు క్రమం తప్పకుండా కంటిపరీక్షలు చేయించడం అవసరం. పరీక్షల ఫలితాల ఆధారంగా ఎగుడుదిగుడు రక్తనాళాలను గుర్తించొచ్చు. వాటికి ఇంజెక్షన్ ద్వారా గానీ, లేజర్ ద్వారా గానీ చికిత్స అందిస్తారు.
ఇలా బిడ్డ చూపును కాపాడుకోవచ్చు. రెటినోపతి ప్రీమెచ్యూర్ అనేది నివారించదగ్గ అంధత్వం. కాబట్టి, మీ బిడ్డకు వైద్యులు సూచించినంత కాలం క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించండి. అలాగే, హియరింగ్ టెస్ట్, కండరాలు, నరాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో తెలుసుకునే.. డెవలప్మెంట్ అసెస్మెంట్ చేయించాలి. రెగ్యులర్ ఫాలోఅప్స్ అవసరం. ఇలా చేయడం వల్ల బిడ్డ శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది. ఏదైనా సమస్య ఉన్నా.. ముందస్తుగానే గుర్తించే వెసులుబాటు ఉంటుంది. సరైన చికిత్స అందించే అవకాశం ఏర్పడుతుంది.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్