ఎండాకాలం అనే కాదు, అన్ని సీజన్లలోనూ నాకు సమస్యే. బయటికి వెళ్తే చాలు. చర్మం కంది పోతుంది. రంగు మారిపోతుంది. ఇదేమైనా రుగ్మతా? మీరే పరిష్కారం చెప్పాలి?
మనుషులు సంఘజీవులు. నాలుగు గోడలకు పరిమితమై బతకలేరు. ఉద్యోగం, ఉపాధి, షాపింగ్, కాయగూరలు.. ఇలా ఏదో ఓ పని మీద బయటికి వెళ్లాల్సిందే. అటూ ఇటూ తిరగడం వల్ల సూర్యకిరణాల ప్రభావానికి లోనవుతాం. తేలికపాటి స్కిన్‌టోన్ కలిగిన వారు, స్కిన్ క్యాన్సర్ రోగులు, మెలనోమా లాంటి సమస్యలు వారసత్వంగా ఉన్నవారు, ఒంటినిండా మచ్చలు కలిగినవారు, కాలినగాయాలతో బాధపడేవారు.. ఇట్టే సూర్య కిరణాల ప్రభావానికి గురవుతారు. దీంతో చర్మం రంగుమారిపోతుంది, దద్దుర్లు వస్తాయి. ముడతలు కనిపిస్తాయి. కళ్లచుట్టూ వలయాలు ప్రత్యక్షం అవుతాయి.
ఈ ఇబ్బందులను అధిగమించాలంటే.. బయటికి వెళ్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అతినీల లోహిత కిరణాల తీవ్రతను అడ్డుకోవాలి. నాణ్యమైన సన్‌స్క్రీన్ లోషన్‌ను ఎంచుకోవడం ద్వారా సగం సమస్యను తొలగించుకోవచ్చు. అప్పటికే ఎంతోకొంత నష్టం జరిగి ఉంటే.. బొటాక్స్ ఇంజెక్షన్స్, లేజర్ ట్రీట్మెంట్, పిగ్మెంటేషన్, ఫిల్లర్స్ ద్వారా చర్మం రంగును, కాంతిని పూర్వస్థితికి తీసుకురావడం సాధ్యమే. చర్మానికి ఏ మేరకు నష్టం జరిగింది, సమస్య ఏ దశలో ఉంది .. అనే విషయాన్ని బేరీజు వేసి నిపుణులు ఓ నిర్ణయం తీసుకుంటారు.
– డాక్టర్ అనున్యా రెడ్డి ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్