మనిషికి వచ్చే ప్రతి జబ్బుకూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాటిని బట్టి వ్యాధి ఏంటో గుర్తించొచ్చు. కానీ, కొన్ని రుగ్మతలకు సంబంధించి లక్షణాలను గుర్తించడం కష్టం. అలాంటి వాటిలో ఒకటి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ వ్యాధి. ఇది శరీరాన్ని చాలా గందరగోళ పరిచే సమస్య. అకస్మాత్తుగా నియంత్రించలేని ఒత్తిడి కలుగుతుంది. ఉన్నట్టుండి కీళ్ల నొప్పులు మొదలవుతాయి. చర్మం పొడిబారిపోతుంది. గట్ సమస్య తీవ్రంగా పరిణమిస్తుంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. దీర్ఘకాలంలో అనేక సమస్యలు పలకరిస్తాయి. ఇంతకీ ఈ ఆటో ఇమ్యూన్ సమస్య ఎందుకొస్తుందంటే..
దీర్ఘకాల ఒత్తిడి: అందరికీ మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆ సమయంలో ఛాతీ పట్టేసినట్లు, దవడ భాగం బిగించినట్లు అవ్వడం, తలంతా తిరిగినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ, ఇవి చాలామందిలో కొంత సమయానికి తగ్గిపోతాయి. అయితే కొంతమందిలో ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తుంటాయి. ఇది ఇలాగే కొనసాగితే.. రోగనిరోధక శక్తి దెబ్బ తింటుంది. ఫలితంగా ఇన్ఫ్లమేషన్, హార్మోన్ల అసమతుల్యత ఇబ్బందులు ఎదురవుతాయి.
గట్ ఆరోగ్యం నిర్లక్ష్యం: గట్ కేవలం జీర్ణాశయ మెషీన్ కాదు. అది రోగనిరోధక వ్యవస్థ లాంటిది. ప్రాసెస్ చేసిన ఆహారం, యాంటి బయాటిక్స్, అధిక షుగర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గట్ లైనింగ్ దెబ్బతింటుంది. అది లీకీగట్గా మారుతుంది. ఇలా రోగనిరోధక వ్యవస్థ గందరగోళానికి గురై అతిగా స్పందించడంతో పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వైరల్ ఇన్ఫెక్షన్లు: కొన్నిరకాల వైరస్లు అంత సులువుగా వదిలిపెట్టవు. అవి మన శరీరం లోపల సజీవంగానే ఉంటూ రోగనిరోధక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాయి. కొందరిలో అవి మరింత తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. అందువల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించాలి.
వాతావారణంలో విషవాయువులు: మన చుట్టూ ఉండే వాతావరణం కూడా శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాయు కాలుష్యం, ప్లాస్టిక్ రసాయనాలు, పురుగుల మందులు లాంటివి మెల్లిమెల్లిగా శరీరంలోకి చేరుతాయి. అవి మూత్రపిండాలు, కాలేయ సమస్యలకు కారణమవుతాయి. దానివల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి ఒక దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.
పోషకాహార లోపం: శరీరానికి కావాల్సిన పోషకాలు కరువైనప్పుడు కూడా రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. విటమిన్ డి, ఒమేగా-3, సిలీనియం, జింక్, ఐరన్ లాంటివి లోపించినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల శరీరంలో దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి తప్ప పరిష్కారం అంత సులువుగా లభించదు.
హార్మోన్ల అసమతుల్యత: పురుషుల కంటే మహిళల్లో ఈ ఆటో ఇమ్యూన్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, కార్టిసోల్, థైరాయిడ్ లాంటి హార్మోన్ల అసమతుల్యతే కారణం. అలాగే గర్భ నిరోధక మాత్రలు, థైరాయిడ్ సమస్య, మెనోపాజ్ వంటివి శరీర పనితీరును పూర్తిగా గందరగోళపరుస్తాయి. ఎప్పుడైతే హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుందో, అప్పుడు రోగనిరోధక వ్యవస్థ దారి
తప్పుతుంది.
దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్: శరీరంలో వివిధ రకాల కారణాలతో ఇన్ఫ్లమేషన్లు వస్తూ పోతూ ఉంటాయి. అన్నిసార్లూ ఇది హాని చేయదు. కానీ అదే పనిగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటివి తీవ్రమైనప్పుడు రోగనిరోధక వ్యవస్థకు పని భారం పెరుగుతుంది. దానివల్ల అది తికమకపడి సరిగ్గా పని చేయదు. అప్పుడు ఆటో ఇమ్యూన్ సమస్యలు మొదలవుతాయి.