Custard Apple | సీజనల్ పండ్లు అంటే సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. మనకు ఏడాదిలో వచ్చే ఆయా సీజన్లలో పలు రకాల పండ్లు లభిస్తుంటాయి. వాటిని తింటే ఎన్నో పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇక అలాంటి పండ్లలో సీతాఫలాలు కూడా ఒకటి. ఇవి ఈ సీజన్లో అధికంగా లభిస్తుంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇవి ఎంతో తియ్యగా అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. సీతాఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, కారెనోయిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. సీతాఫలాల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఇన్ఫెక్షన్లతోపాటు దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
సీతాఫలాల్లో లుటీన్, జియాజాంతిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. డిజిటల్ తెరలను చూడడం వల్ల కళ్లపై పడే నీలి కిరణాల ప్రభావం తగ్గుతుంది. అలాగే సూర్యుని నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల బారి నుంచి కూడా కళ్లకు రక్షణ లభిస్తుంది. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా వృద్ధాప్యంలో కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా ఉంటాయి. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ సి వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. సీతాఫలాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఈ పండ్లను తింటే మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఈ పండ్లలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తాయి. శరీరంలోని ద్రవాలను సమతుల్యంలో ఉంచుతాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో సోడియం స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. బీపీ తగ్గుతుంది. కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. హృదయ సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. సీతాఫలాల్లో అనేక బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు యాక్టివ్‌గా, ఉత్సాహంగా పనిచేసేలా చేస్తాయి. దీని వల్ల మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండ్లను తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీని వల్ల యాక్టివ్‌గా ఉంటారు, ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి.
సీతాఫలాలను 100 గ్రాముల మోతాదులో తింటే సుమారుగా 101 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 25 గ్రాములు, సహజసిద్ధమైన చక్కెరలు 12.7 గ్రాములు, ఫైబర్ 2.4 గ్రాములు, ప్రోటీన్లు 1.7 గ్రాములు ఉంటాయి. అధిక మొత్తాల్లో విటమిన్లు సి, బి6, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇక సీతాఫలాలను ఎవరైనా సరే తినవచ్చు. కానీ డయాబెటిస్ ఉన్నవారు అధికంగా తినకూడదు. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటే 50 గ్రాముల మోతాదులో లేదా ఒక పండును తినవచ్చు. షుగర్ నియంత్రణలో లేకపోతే ఈ పండ్లను తినకూడదు. అలాగే బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు కూడా ఈ పండ్లకు దూరంగా ఉంటే మంచిది. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ సీతాఫలాలను తింటుంటే అనేక లాభాలు కలుగుతాయి.