Intermittent Fasting | శరీర జీవక్రియలను పెంచుకోవడానికి, బరువు తగ్గడానికి, కొవ్వు నిల్వలను తగ్గించుకోవడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవడానికి మనలో చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఫాస్టింగ్ లో శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగించడం ప్రారంభిస్తుంది. 16 : 8 నిష్పత్తిలో ఈ ఫాస్టింగ్ చేస్తారు. అనగా 16 గంటలు ఉపవాసం ఉండి 8 గంటలు ఆహారాన్ని తీసుకుంటారు. ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. కాలక్రమేణా హెచ్‌బిఎ1సి మెరుగుపడుతుంది. మధుమేహ నిర్వహణకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులందరికి ఈ ఫాస్టింగ్ ఉపయోగకరంగా ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ తో బాధపడే వారు ఈ ఫాస్టింగ్ ను వైద్యుల పర్యవేక్షణలో చేయడం మంచిదని వారు సలహా ఇస్తున్నారు. ఈ ఫాస్టింగ్ సరిగ్గా చేయకపోతే హైపోగ్లైసీమియా, హైపర్గ్లైసీమియా రెండింటికి దారి తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి మందులు తీసుకునే వారు ఈ ఉపవాసం చేయడం వల్ల వారిలో గ్లూకోజ్ స్థాయిలు మరింత తగ్గుతాయి. మరోవైపు ఉపవాసం ఎక్కువ సమయం చేయడం వల్ల కొందరు చక్కెర, కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం జరుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కనుక ఇది డయాబెటిస్ రోగులందరికి తగినది కాదని అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదర్కోవాల్సి వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటే జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో ఈ ఫాస్టింగ్ చేయడం ప్రారంభించాలి. ఈ ఫాస్టింగ్ చేసే ముందు మనం వాడే మోతాదులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అలాగే క్రమం తప్పకుండా చక్కెర స్థాయిలను పర్యవేక్షిస్తూ ఉండాలి. దీని వల్ల హైపోగ్లైసీమియాను ముందుగానే గుర్తించవచ్చు. నిరంతర పర్యవేక్షణ ఈ ఫాస్టింగ్ లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేసేదే అయినప్పటికీ ఇది అందరికీ తగినది కాదని అలాగే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఫాస్టింగ్ చేయడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.