Weight Loss | బరువు తగ్గడానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. శరీర బరువు అదుపులో ఉంటేనే శరీర ఆరోగ్యం బాగుంటుంది. శరీర బరువు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టు ముడతాయి. నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన రావడంతో చాలా మంది శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడంతో పాటు సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అలాగే క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారంతో పాటు రకరకాల పానీయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు శరీర బరువును అదుపులో ఉంచే పానీయాల్లో ముందుగా చెప్పుకోదగినవి గ్రీన్ టీ, బ్లాక్ టీ.
ఈ రెండింటినీ కూడా ఫిట్నెస్ అభిమానులు ఎంతగానో ఇష్టపడతారని చెప్పవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియలు పెరిగి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అయితే గ్రీన్ టీ, బ్లాక్ టీలలో దేనిని తీసుకోవడం వల్ల మనం వేగంగా బరువు తగ్గవచ్చు అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. గ్రీన్ టీ, బ్లాక్ టీలలో దేనిని తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గవచ్చు అన్న వివరాలను పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. గ్రీన్ టీ లో దాదాపు సున్నా క్యాలరీలు ఉంటాయి. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. గ్రీన్ టీ లో క్యాలరీలను ఎక్కువగా బర్న్ చేసే కాటెచిన్ లు ఉంటాయి. అలాగే ఈ టీ నెమ్మదిగా పనిచేస్తుంది. కానీ స్థిరమైన కొవ్వు ఆక్సీకరణకు మద్దతు ఇస్తుంది. పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ ఎక్కువగా పని చేస్తుంది.
అలాగే బ్లాక్ టీ లో కూడా దాదాపు సున్నా కేలరీలు ఉంటాయి. కానీ దీనిలో కెఫిన్ సమృద్దిగా ఉంటుంది. బ్లాక్ టీలోని కెఫిన్ జీవక్రియను, శక్తిని పెంచుతుంది. బ్లాక్ టీ వ్యాయామాల సమయంలో కొవ్వును కరిగించడాన్ని పెంచుతుంది. కానీ దీనిని అతిగా తీసుకోవడం వల్ల వణుకుకు కారణమవుతుంది. వ్యాయామాలకు ముందు త్వరగా శక్తిని పెంచడంలో బ్లాక్ టీ పని చేస్తుంది. బరువు తగ్గడంలో గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండు మేలు చేసేవే అయినప్పటికి గ్రీన్ టీ కొంచెం ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వీటిలో పాలు, చక్కెర వంటి వాటిని కలపకుండా తీసుకోవాలి. అలాగే రోజుకు 2 నుండి 3 కప్పులు మాత్రమే తీసుకోవాలి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల జీర్ణసమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక టీ లను తాగినంత మాత్రాన బరువు తగ్గరు. సరైన జీవనశైలి, ఆహార పద్దతులను పాటించడం వల్లనే శరీర బరువు అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.