Massage Oils | ఆయుర్వేదంలో అనేక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మసాజ్ చేయడం కూడా ఒకటి. నిర్దిష్టమైన నూనెను వాడి మసాజ్ చేస్తారు. తరువాత స్టీమ్ బాత్ చేయిస్తారు. ఇలా ఆయుర్వేదంలో రకరకాల మసాజ్ థెరపీలు ఉంటాయి. అయితే ఇవే కాకుండా సాధారణంగా ఎవరైనా సరే వారంలో ఒక రోజు శరీరానికి ఏదైనా నూనెతో మసాజ్ చేసి తలస్నానం చేస్తే ఎన్నో ఉపయోగాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. శరీరానికి మసాజ్ చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అందులో భాగంగానే చాలా మంది మసాజ్లను కూడా చేయించుకుంటుంటారు. అయితే మసాజ్ కోసం ఏ నూనెను వాడాలి, ఏ నూనెను వాడి మసాజ్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న విషయాలపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. వీటి గురించి ఆయుర్వేద వైద్యులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరానికి మసాజ్ చేసేందుకు ఏ నూనె పడితే అది పనికి రాదు. అందుకు కొన్ని నిర్దిష్టమైన ఆయిల్స్‌ను మాత్రమే ఉపయోగించాలి. అలాంటి నూనెల్లో ఆలివ్ ఆయిల్ చాలా ముఖ్యమైనది. శరీరానికి తేలికపాటి మసాజ్ చేసేందుకు అయితే ఆలివ్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. ఈ నూనెను శరీరం చాలా సులభంగా శోషించుకుంటుంది. దీని వల్ల కండరాలు రిలాక్స్ అయి నొప్పులు తగ్గుతాయి. శరీరానికి తేమ లభిస్తుంది. పొడిదనం తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఈ నూనెతో తరచూ మసాజ్ చేసుకుంటుంటే చర్మం ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటుంది. అలాగే మసాజ్ కోసం ఉపయోగించాల్సిన నూనెల్లో నువ్వుల నూనె కూడా ముఖ్యమైనది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
శరీరానికి మసాజ్ చేసేందుకు గాను కొబ్బరినూనెను కూడా వాడవచ్చు. ఇది చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. పొడిదనాన్ని తగ్గిస్తుంది. దీంతో చర్మం సురక్షితంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. కనుక చర్మ సమస్యలు ఉన్నవారు ఈ నూనెను ఉపయోగిస్తుంటే మేలు జరుగుతుంది. అలాగే మసాజ్ కోసం బాదంనూనెను కూడా వాడుకోవచ్చు. ఇది కూడా మనకు లాభాలను అందిస్తుంది. బాదం ఆయిల్‌ను కూడా శరీరం త్వరగా శోషించుకుంటుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ఈ నూనెలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. తామర, గజ్జి వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
శరీరానికి ఆవనూనెతోనూ మసాజ్ చేయవచ్చు. ఇది ఇతర నూనెలతో పోలిస్తే కాస్త జిడ్డు ఎక్కువగా ఉంటుంది. కానీ అనేక లాభాలను అందిస్తుంది. ఈ నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మానికి కావల్సిన తేమ లభిస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి ఈ నూనె ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల చర్మ క్యాన్సర్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అయితే ఈ నూనెలలో ఏ నూనెతో మసాజ్ చేసుకున్నా సరే ఉదయం చేసుకుంటే మంచిది. అలాగే మసాజ్ చేసిన తరువాత కనీసం 30 నిమిషాలు వేచి ఉండి అనంతరం స్నానం చేయాలి. దీని వల్ల చర్మంలోకి నూనె సరిగ్గా శోషించుకోబడుతుంది. అలాగే మసాజ్ చేసేటప్పుడు సున్నితంగా చేయాల్సి ఉంటుంది. నిపుణులతో చేయించుకుంటే ఇంకా ఎంతో ఫలితం ఉంటుంది. ఇలా ఆయా నూనెలను శరీరానికి మసాజ్ కోసం వాడి అనేక లాభాలను పొందవచ్చు.