తిండి అరగడం కోసం, బలమైన రోగ నిరోధక వ్యవస్థ కోసం, నిలకడైన మూడ్ కోసం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేకూరాలంటే పొట్టకు మంచి చేసే పదార్థాల గురించి తెలుసుకోవాల్సిందే.
పొట్ట లోపల ఉన్న మంచి బ్యాక్టీరియాను పెంపొందించడానికి మనం తీసుకునే ఆహారాన్ని ప్రీబయోటిక్ ఫుడ్ అంటారు. మొక్కల నుంచి లభించే ఫైబర్ పొట్టలో మంచి బ్యాక్టీరియాకు ఆహారాన్ని సమకూరుస్తుంది. అలా మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అరటిపండ్లు, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, జెరూసలేం ఆర్టిచోక్స్ (పొద్దు తిరుగుడు జాతికి చెందిన మొక్క), ఆస్పరాగస్ (తెలుగులో పిల్లితేగ అంటారు లిల్లీ జాతికి చెందింది), ఆపిల్, డాండీలియన్ గ్రీన్స్, ఓట్స్ మంచి ప్రీబయోటిక్ పదార్థాలు.
మన ఆహారంలోని కొన్ని రకాల సజీవ బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లి అక్కడున్న మంచి బ్యాక్టీరియాను కోట్లాదిగా పెంచుతుంది. ఇలాంటి పదార్థాలనే ప్రొబయోటిక్స్ అంటారు. పెరుగు, యోగర్ట్ లాంటివి పొట్టకు మేలుచేసే ప్రొబయోటిక్స్.
ప్రీబయోటిక్ పదార్థాల మీద ఆధారపడి ప్రొబయోటిక్స్ అభివృద్ధి చెందుతాయి. ఈ రెండిటి కలయిక వల్ల ఏర్పడే ఉప ఉత్పత్తులే పోస్ట్బయోటిక్స్. ఇవి పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదింపజేస్తాయి. దీనికోసం ప్రీబయోటిక్స్, ప్రొబయోటిక్స్ ఆహార పదార్థాలు రెండిటిని వేరువేరుగా తీసుకోవాలి.
పొట్ట ఆరోగ్యం కోసం ఇచ్చే సప్లిమెంట్లలో ఈ పదం కనిపిస్తుంది. ఇది ప్రీబయోటిక్స్, ప్రొబయోటిక్స్ మిశ్రమం. అయితే ఈ రెండు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తినడం కంటే, వీటి మిశ్రమాన్ని ఒకేసారి తీసుకోవడం ప్రభావవంతంగా ఉంటుందా? అనేదానిపై పరిశోధనలు స్పష్టతను ఇవ్వలేదు. కాబట్టి, సింబయోటిక్ సప్లిమెంట్లు వాడే విషయంలో డాక్టర్ సలహా తప్పనిసరి.