Water Fasting | వాటర్ ఫాస్టింగ్ అనేది 24 నుండి 72 గంటల పాటు ఎలాంటి ఆహారం లేదా కాలరీల పానీయాలు తీసుకోకుండా కేవలం నీటినే తీసుకునే పద్ధతి. ఇటీవల కాలంలో ఇది ఒక ప్రముఖ ఆరోగ్య ట్రెండ్‌గా మారింది. బరువు తగ్గడం, మెటబాలిజం మెరుగుపరచడం కోసం చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, టైమ్-రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే ప్రతి ఫాస్టింగ్ విధానం అందరికీ ఒకే విధంగా పనిచేయదు. నిపుణుల ప్రకారం వాటర్ ఫాస్టింగ్ సమయంలో శరీరంలో జరిగే మార్పులు దశలవారీగా ఉంటాయి. మొదటి 12 గంటల్లో శరీరం నిల్వలో ఉన్న గ్లూకోజ్‌ను వినియోగిస్తుంది. 12 నుండి 24 గంటల మధ్య శరీరం కీటోసిస్ దశలోకి ప్రవేశించి కొవ్వును ఎనర్జీగా ఉపయోగించడం ప్రారంభిస్తుంది. 24 గంటల తర్వాత ఆటోఫాజీ అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఇందులో కణాలు తమలోని పాడైన భాగాలను శుభ్రం చేసుకుంటాయి.
అలాగే వాటర్ ఫాస్టింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. లెప్టిన్ హార్మోన్ పనితీరును మెరుగుపరచి ఆకలి నియంత్రణలో సహకరిస్తుంది. దీని వల్ల ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది. కాలరీలు తీసుకోకపోవడంతో శరీరం నిల్వలో ఉన్న కొవ్వును ఉపయోగించి శక్తిని పొందుతుంది. మొదట్లో తగ్గేది నీటి బరువు అయినప్పటికీ, తరువాత కొవ్వు తగ్గుదల కూడా జరుగుతుంది. అంతేకాకుండా వాటర్ ఫాస్టింగ్ వల్ల హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, వాపులు వంటి రిస్క్ ఫ్యాక్టర్లు తగ్గి గుండె వ్యాధులు, డయాబెటిస్, కొన్ని క్యాన్సర్ల ప్రమాదం కూడా తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి, శరీరం రిపేర్, రీజనరేషన్ ప్రక్రియలపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇది మానసికంగా కూడా ఉపయోగపడుతుంది. మెదడు స్పష్టత పెరగడం, బ్రెయిన్ ఫాగ్ తగ్గడం, మానసిక ప్రశాంతత పెరగడం వంటి లాభాలు కలుగుతాయి.
అయితే వాటర్ ఫాస్టింగ్‌కు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. తలనొప్పి, తల తిరగడం, అలసట, శక్తి లేమి, డీహైడ్రేషన్, కండర ద్రవ్యరాశి తగ్గడం, పోషక లోపాలు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇది అందరికీ అనుకూలం కాదు. తక్కువ బరువు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు, ఈటింగ్ డిజార్డర్స్ లేదా గుండె సంబంధిత సమస్యలున్నవారు ఈ విధానాన్ని అనుసరించకూడదు. వాటర్ ఫాస్టింగ్ ఒక మెటబాలిక్ టూల్ మాత్రమే, ఇది మ్యాజిక్ పరిష్కారం కాదు. దీనిని తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.